ఆలయాలకు రక్షణ కరువు

ABN , First Publish Date - 2020-09-14T10:07:44+05:30 IST

వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం ..

ఆలయాలకు రక్షణ కరువు

వైసీపీ పాలనలో ఒక వర్గానికే భద్రత

టీడీపీ నాయకులు సోమిశెట్టి, గౌరు చరిత

జిల్లా వ్యాప్తంగా ఆలయాల వద్ద నిరసనలు 


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 13: వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి గౌరు చరిత, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పెరుగు పురుషోత్తం రెడ్డి అన్నారు. అంతర్వేదిలో రథాన్ని దహనం చేయడమే ఇందుకు నిదర్శనమని వారు అన్నారు. ఇప్పటిదాకా ప్రజలపైనే దాడులు జరిగాయని, ఇప్పుడు దేవుళ్ల వంతు వచ్చిందని వారు అన్నారు. కల్లూరులోని సూర్య దేవాలయంలో వారు పూజలు నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు జిల్లాలోని దేవాలయాల వద్ద ఆదివారం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.


దేవాలయాల పరిరక్షణపై ఈ నెల 19 వరకు నిరసన తెలపాలని, ప్రజల్లో మత సామరస్యంపై అవగాహన పెంచాలని చంద్రబాబు పిలుపునిచ్చారని వారు తెలిపారు. అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్లకార్డులను ప్రదర్శించారు. జగన్‌ అధికారాన్ని చేపట్టిన తరువాత రాష్ట్రంలో జరగ కూడని ఆకృత్యాలన్నీ జరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలు, బడుగులు, మహిళలు, దళితులు, వైద్యులపై దాడులు జరుగుతున్నాయని, ప్రస్తుతం హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయని ఆరోపించారు. దేవాలయాల రక్షణ దేవుళ్లే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమోనని సోమిశెట్టి ఆవేదన వ్యక్తంచేశారు.


వైసీపీ చోటామోటా నాయకులకు ప్రభుత్వం గన్‌మన్‌లను ఇచ్చి రక్షణ కల్పించిందని, కానీ దేవాలయాలకు మాత్రం రక్షణ లేదని అన్నారు. అంతర్వేది ఘటనపై ఆ పార్టీ నాయకులు పొంతన లేని మాటలు చెబుతన్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన భద్రత కల్పించామని అన్నారు. జగన్‌ కేవలం ఒక మతం, ఒక వర్గం ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణరెడ్డి, నాగేంద్ర కుమార్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, పోతుల రవికుమార్‌, అబ్బాస్‌, చంద్రకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-14T10:07:44+05:30 IST