అద్దె చెల్లించరా?

ABN , First Publish Date - 2020-11-07T06:07:18+05:30 IST

సచివాలయాల అద్దె భవనాలకు యజమానులు తాళాలు వేసేశారు. ఏడాదిగా అద్దె చెల్లించడం లేదని భవనాల యజమానులు అన్నారు.

అద్దె చెల్లించరా?
నందికొట్కూరులో సచివాలయానికి తాళం

  1. సచివాలయాలకు తాళం వేసిన యజమానులు
  2. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న కమిషనర్‌ 


నందికొట్కూరు, నవంబరు 6: సచివాలయాల అద్దె భవనాలకు యజమానులు తాళాలు వేసేశారు. ఏడాదిగా అద్దె చెల్లించడం లేదని భవనాల యజమానులు అన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని 3, 4వ వార్డుల్లో శుక్రవారం ఇలా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కింద సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో వార్డు సచివాలయాలను ప్రారంభిం చింది. అయితే ప్రభుత్వం ఇంతవరకు అద్దె చెల్లించలేదని ఆగ్రహించి తాళం వేసినట్లు భవనాల యజమానులు శ్రీకాంత్‌, శ్రీనివాసులు తెలిపారు. అద్దె చెల్లించే వరకు తాళం తీసేది లేదని వారు తేల్చి చెప్పారు. తాళం వేయడంతో సిబ్బంది ఆరు బయట ఉండిపోయారు. మున్సిపల్‌ అధికారులు వచ్చి వారితో చర్చించినా ఫలితం కనిపించలేదు. గతంలో పట్టణంలోని 14వ వార్డు సచివాలయ యజమాని కూడా ఇలాగే తాళం వేశారు. అధికారులు వచ్చి అద్దె చెల్లిస్తామని యజమానికి చెప్పి తాళం తీయించారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న సచివాలయాలకు అద్దెలు చెల్లించకపోడంతో నందికొట్కూరు పట్టణంలో తరచూ ఈ పరిస్థితి తలెత్తుతోంది. పట్టణంలో ఎక్కువ శాతం సచివాలయాలు అద్దె భవానాల్లోనే ఉన్నాయి. సీపీఎం నాయకులు మూతపడిన సచివాలయాల వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో పట్టణంలో తరచూ సచివాలయాల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దె వెంటనే చెల్లించాలని మున్సిపల్‌ మేనేజర్‌ బేబికి వినతిపత్రం అందజేశారు. 


పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..

వార్డు సచివాలయాలకు తాళం వేసిన ఇళ్ల యజమానులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డి తెలిపారు. గృహాలను అద్దెకు తీసుకునే ముందే యజమానులతో ఒప్పందం చేసుకున్నామని, ప్రభుత్వం నిధులను నేరుగా యజమానుల బ్యాంకు ఖాతాకే జమ చేస్తుందని చెప్పామని అన్నారు. మున్సిపల్‌ అధికారులను, సచివాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా తాళాలు వేసి ఉద్యోగులను ఇబ్బంది పెట్టడంపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెడతామని తెలిపారు. 

Updated Date - 2020-11-07T06:07:18+05:30 IST