‘ఇంటి నుంచి బయటకు రావద్దు’
ABN , First Publish Date - 2020-03-27T10:30:10+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయని, ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని మండల అధికారులు ప్రజలు, మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు.
బేతంచెర్ల, మార్చి 26: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయని, ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని మండల అధికారులు ప్రజలు, మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐ కేశవరెడ్డి ఆధ్వర్యంలో మత పెద్దలతో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో అశ్వినీ కుమార్, నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు, సీఐ కేశవరెడ్డి ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.
శ్రీశైలం:
శ్రీశైలం మండల పరిధిలోని శ్రీశైలం, సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో ప్రజలు లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఈ నెల 31 వరకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మ వార్ల దర్శనాన్ని రద్దు చేయడంతో ఆలయ క్యూలైన్లు, క్షేత్ర ప్రధాన వీధులు నిర్మానుషంగా మారాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే నిత్యావసరాలను కొనేందుకు అనుమతిస్తున్నారు. మండలంలో నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేదని తహసీల్దార్ బి.రాజేంద్రసింగ్ తెలిపారు.
నంద్యాల(ఎడ్యుకేషన్):
నంద్యాలలో నాల్గో రోజు లౌక్ డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారు. రోడ్లపైకి రాకుం డా ఇళ్ళకే పరిమితమయ్యారు. పట్టణంలో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పోలీసులు పకడ్బంధీగా విధులు నిర్వహించారు. ఏఎస్‌పీ ఆంజనే యులు, డీఎస్పీ చిదానందరెడ్డి రోడ్లపైకి వచ్చి పర్యవేక్షిం చారు. 1 గంట తరువాత పట్టణంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు మూసి వేయించారు.
నిర్మానుష్యంగా ఎన్‌జీవో కాలనీ
నంద్యాల:
వేలాది మంది విద్యార్థులతో కిటకిటలాడే ఎన్‌జీవో కాలనీ ప్రధాన రోడ్డుతోపాటు అంతర్గత రోడ్లన్నీ లాక్‌డౌన్ అయినప్పటి నుంచి నిర్మానుష్యంగా మారాయి. వేలాది మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎన్‌జీవో కాలనీ వీధుల్లో వందల కుటుంబాలు మెస్‌లు, హాస్టళ్ల నిర్వ హణతో పాటు రోడ్ల పక్కన కర్రీ పాయింట్లు నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి ఇవన్నీ మూత పడ్డాయి. స్వస్థలాలకు వెళ్ళలేక ఇక్కడే నిలబడి పోయిన విద్యార్థులకు మెస్‌లు అందుబాటులో లేవు. వారికి వంట చేసుకునే అలవాటు లేకపోవడంతో తీవ్ర తిండితిప్పలతో అల్లాడిపోతున్నారు. వీరి కోసం భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు మూతపడిన హాస్టళ్లను వెంటనే తెరిపించాల్సిన అవసరం ఉంది.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..శివకుమార్, అదిలాబాద్ జిల్లా, తెలంగాణ
దాదాపు 600 మందికి పైగా మేము మా స్వస్థలాలకు వెళ్లేందుకు 50 నుంచి 60 వాహనాల్లో సొంత ఖర్చుతో బయలు దేరి వెళ్లాం. ఇక్కడి టూ టౌన్ పోలీసులు అను మతి పత్రాలు ఇచ్చారు. సరిహద్దులో తెలంగాణ అధికా రులు అనుమతించలేదు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవడంలో విఫలం కావడం తోనే తెలంగాణాలో ఉన్న ఏపీ విద్యార్థులకు, ఏపీలో ఉన్న తెలంగాణా విద్యార్థులకు సమస్యలు ఏర్పడ్డాయని మాకు అర్థమైంది. వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని విద్యార్థులను వారి వారి స్వస్థలా లకు చేర్చాలి.
డోన్ (రూరల్):
మండలంలోని పలు గ్రామాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌లో భాగంగా రూరల్ పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇళ్లకు పరిమితం కావాలని బయటకు రాకూడదని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో పలు గ్రామంలోని ప్రధాన వీధులు, ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మండలంలోని చిన్నమల్కాపురం, ఉడుములపాడు, వెంకటనాయునిపల్లి, కామగానికుంట్ల, తిమ్మాపురం, కొత్తపల్లి, సీసంగుంతల, ఎద్దుపెంట తదిర గ్రామాల్లో లాక్‌డౌన్ కొనసాగింది.
ఆత్మకూరు:
ఆత్మకూరు ప్రాంతంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. బుధవారం వరకు నిత్యావసర, మెడికల్ దుకాణాలను యఽథావిధిగా కొనసాగించిన అధికారులు గురువారం నుంచి నిత్యావసర సరుకుల విక్రయాలకు సంబంధించి సమయవేళలు నిర్ధేశించారు. మందుల దుకాణాల మినహా కూరగాయలు, పండ్లు, కిరాణం, మాంసం విక్రయాలను ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారాయి. శుక్రవారం నుంచి పెట్రోల్ బంకులను రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారని ఆత్మకూరు ఎస్‌ఐ తెలిపారు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు, సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
ఆళ్లగడ్డ:
కరోనా వ్యాధి నివారణకు ప్రజలు సహకరించా లని ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ కార్యాలయం వద్ద కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్లిచింగ్ పౌడర్ పిచికారీ కార్యక్రమాన్ని ప్రారం భించారు. కార్యక్రమంలో కమిషనర్ రమేష్ బాబు, తహసీ ల్దార్ రవి, అగ్నిమాపక అధికారి లక్ష్మయ్య, మార్కెట్ యార్డు కమిటీ ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, నాయకులు గొట్లూరు సుధాకరరెడ్డి, భరత్‌రెడ్డి, మున్సిపల్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.
దొర్నిపాడు:
కరోనాకు చెక్ పెట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్యాధికారి నాగేంద్ర, పంచాయతీ కార్యద ర్శులు కోరారు. గురువారం ఆయా గ్రామాల్లోని కాలనీల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దొర్నిపాడు గ్రామంలో వలంటీర్లు ట్రాక్టర్‌పై మైక్ ఉంచి కరోనా వైరస్ సోకే లక్షణాలపై ప్రజలకు అవ గాహన కల్పించారు.
కోడుమూరు (రూరల్):
మండలంలోని గోరంట్ల, లద్దగిరి, అనుగొండ, ఎర్రదొడ్డి, వెంకటగిరి, చిల్లబండ గ్రామాల్లో గురువారం ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహించారు. వీధుల్లోకి రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని కోరారు.