ఆర్‌ఏఆర్‌ఎస్ భూములు కేటాయించొద్దు
ABN , First Publish Date - 2020-07-19T11:00:05+05:30 IST
నంద్యాల వైద్య కళాశాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, రైతు శిక్షణా కేంద్రం, బయోలాజికల్ ల్యాబ్ భూములను,

నంద్యాల మెడికల్ కాలేజీకి వేరే భూములు చూడాలి
సీఎం జగన్‌కు అఖిల పక్ష, రైతు సంఘాల వినతి
నంద్యాల, జూలై 18: నంద్యాల వైద్య కళాశాలకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, రైతు శిక్షణా కేంద్రం, బయోలాజికల్ ల్యాబ్ భూములను, నిర్మాణాలను కేటాయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు, అఖిల పక్ష, రైతు సంఘాల సమావేశ ప్రతినిధి బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్ భూముల బదలాయింపు ఆలోచన, కార్యాచరణ నిలుపుదల చేయాలని అఖిల పక్ష, రైతు సంఘాల సమావేశం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు.
అఖిల పక్ష, రైతు సంఘాల ప్రతినిధులు శనివారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, బీజేపీ పార్లమెంట్ ప్రతినిధి డాక్టర్ బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి, సీపీఎం జిల్లా కన్వీనర్ రమేష్‌కుమార్, సీపీఐ జిల్లా నాయకుడు బాబాఫకృద్దీన్, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్, ఏపీ రైతు సంఘం ప్రతినిధులు రాజశేఖర్, నరసింహులు, సీపీఐ సామన్న, నంది రైతు సమాఖ్య, భారతీయ కిసాన్‌సంఘ్, ఏపీ రైతు సంఘాల సమాఖ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిన అంశాలను పొందుపరుస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ పంపినట్లు బొజ్జా తెలిపారు.
నంద్యాలలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ వైద్య కళాశాలకు దేశ వ్యాప్త గుర్తింపు కలిగి, వ్యవసాయ పరిశోధనల్లో ప్రఖ్యాతి గడించిన ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను బదలాయింపును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నంద్యాలకు సమీపంలో నూలుమిల్లు స్థలం నిరుపయోగంగాఉందని, అయ్యలూరు సమీపంలో ఉన్న 100 ఎకరాల చక్కెర పరిశ్రమ భూములు, రైల్వేస్టేషన్ సమీపంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ స్థలం, నూనెపల్లె మార్కెట్ యార్డు స్థలాలను మెడికల్ కాలేజీకి ఉపయోగించుకోవచ్చునని సూచించారు.
ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. లేదంటే ఆర్‌ఏఆర్‌ఎస్ భూములను కాపాడుకునేందుకు అఖిల పక్ష, రైతు సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని బొజ్జా పేర్కొన్నారు.