లెక్కల్లో తప్పులెందుకు?

ABN , First Publish Date - 2020-03-18T11:11:35+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టే చర్యలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

లెక్కల్లో తప్పులెందుకు?

కరోనా సర్వేలో పొంతనలేని గణాంకాలు

విదేశాల నుంచి జిల్లాకు 235 మంది రాక

140 మందినే చూపించిన వైద్య ఆరోగ్యశాఖ

నత్త నడకన సాగుతున్న ఇంటింటి సర్వే


కర్నూలు(హాస్పిటల్‌), మార్చి 16: కరోనా వైరస్‌ కట్టడికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టే చర్యలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆశా కార్యకర్తలు, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి సర్వే చేయిస్తోంది. వారు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో  సుమారు 10.50 లక్షల కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకు 7.50 లక్షల కుటుంబాల వివరాలను సేకరించినట్లు తెలిసింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ప్రత్యేకంగా సేకరిస్తున్నారు.


పొంతన లేని లెక్కలు

ఫిబ్రవరి 10 తరువాత విదేశాల నుంచి 140 మంది జిల్లాకు వచ్చారని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే స్టేట్‌ హెల్త్‌ బులెటిన్‌ లెక్కలతో ఈ సంఖ్య సరిపోలడం లేదు. అధికారుల లెక్కలు ఒక విధంగా, కలెక్టర్‌కు ఇచ్చే నివేదికలో మరో విధంగా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వే ప్రకారం 140 మంది విదేశాల నుంచి జిల్లాకు వచ్చారు. వీరందరినీ హోం ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స చేస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రామగిడ్డయ్య చెబుతున్నారు. కానీ కలెక్టర్‌కు సోమవారం ఇచ్చిన నివేదికలో విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్య 235 అని చూపించారు. ఇలా కొన్ని కేసులను దాచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


విదేశాల నుంచి వచ్చినవారి చిరునామాను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించలేకపోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. వారిని పూర్తిస్థాయిలో గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళనల ప్రజల్లో నెలకొంది. పొరపాటున వారిలో వైరస్‌ సోకినవారు ఉంటే మరింత మందికి వ్యాపిస్తుందని అంటున్నారు. కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో విదేశాల నుంచి వచ్చి 28 రోజులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య 11 ఉండగా, హెల్త్‌ బులెటిన్‌లో 8 మంది ఉన్నట్లు చూపించారు. హోం ఐసోలేషన్‌లో 164 మంది ఉన్నట్లు కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కానీ హెల్త్‌ బులెటిన్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉంది. 


సర్వే ఇలా..

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కరోనా వ్యాధిపై నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే నత్తనడకన సాగుతోంది. వలంటీర్లు సర్వే వివరాలను సరిగా నమోదు చేయడం లేదన్న ఆరోపనలు వస్తున్నాయి. వలంటీర్లలో కొందరికి ట్యాబ్‌లు లేనట్లు తెలిసింది. ఆశా కార్యకర్తలు సర్వే చేస్తున్నా, ఆ గణాంకాలను వార్డు వలంటీర్లు సరిగా నమోదు చేయడం లేదు. సర్వర్‌ సమస్యల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది. జిల్లాలో హొళగుంద, పత్తికొండ, చాగలమర్రి, డోన్‌, శిరివెళ్ల, హాలహర్వి, ఓర్వకల్లు, కౌతాళం, సంజామల, వెల్దుర్తి, కర్నూలు అర్బన్‌లో ఇంటింటి సర్వే నత్తనడకన సాగుతోంది. 


వేగవంతంగా చేస్తాం..డాక్టర్‌ రామగిడ్డయ్య, డీఎంహెచ్‌వో

కరోనా వ్యాధిపై ఇంటింటి సర్వేను వేగవంతం చేస్తాం. కొన్ని పీహెచ్‌సీల పరిధిలో సర్వే నెమ్మదిగా సాగుతోంది. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. విదేశాల నుంచి వచ్చిన 140 మందిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. వీరిలో ఎక్కువ మంది కువైట్‌, దుబాయి నుంచి వచ్చినవారు, మత ప్రచారకులు ఉన్నారు. 

Updated Date - 2020-03-18T11:11:35+05:30 IST