శిఖండి రాజకీయం చేస్తున్నారంటూ.. ఆ ముగ్గురిపై బైరెడ్డి ఫైర్

ABN , First Publish Date - 2020-11-13T06:02:10+05:30 IST

నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు..

శిఖండి రాజకీయం చేస్తున్నారంటూ.. ఆ ముగ్గురిపై బైరెడ్డి ఫైర్

నందికొట్కూరు వైసీపీలో లుకలుకలు

బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సభలో బట్టబయలు

జెండా మోసిన వారికి న్యాయం జరగలేదు

వైసీపీ సమన్వయకర్త సిద్ధార్థరెడ్డి


నందికొట్కూరు(కర్నూలు): నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ నాయకులు రెండుగా విడిపోయారన్న ప్రచారం ఉంది. తొలి నుంచి ఎమ్మెల్యే ఆర్థర్‌, పార్టీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గాలకు పడడం లేదు. ఇటీవల మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఎంపిక విషయంలో కూడా రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి. ఏకంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రిపైనే ఓవర్గం అప్పట్లో విమర్శల దాడి చేసింది. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర పూర్తయి మూడేళ్లు గడిచిన సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో గురువారం ర్యాలీ, పటేల్‌ సెంటర్‌లో సభ నిర్వహించారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ సభలో సిద్ధార్థరెడ్డి తన ప్రత్యర్థి వర్గంపై విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదని మండిపడ్డారు.


వైసీపీలోకి మధ్యలో వారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు శిఖండి రాజకీయం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. జిల్లాలో పెద్ద నాయకులం అనుకునే వాళ్లు వారి పంథా, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. నందికొట్కూరులో వేలు పెడడతాం.. రాక్షసానందం పొందుతామంటే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలో పనికిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఐజయ్య, లబ్బి వెంకటస్వామి, హాజీ మహబూబ్‌సాహెబ్‌, చంద్రమౌళి, జాకీర్‌, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ శివరామక్రిష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేష్‌ నాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T06:02:10+05:30 IST