తేడా కొడుతోంది!

ABN , First Publish Date - 2020-11-26T06:51:51+05:30 IST

పుష్కర ఘాట్లలో కొవిడ్‌ పరీక్షలపై తేడా కొడుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలు పొంతన కుదరడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తేడా కొడుతోంది!
కర్నూలులో వైద్య శిబిరాన్ని తనిఖీ చేస్తున్న అడిషినిల్‌ డీఎంహెచ్‌వో

  1. పుష్కర సిబ్బంది, భక్తులకు కొవిడ్‌ పరీక్షలు 
  2. 99 వేల మందికి థర్మల్‌ టెస్టులు చేశారట!
  3. అయినా ఫలితాలు ప్రకటించని వైనం
  4. పుష్కర ఘాట్లలో 12 పాజిటివ్‌ కేసులు
  5. సాంస్కృతిక కార్యక్రమాల నిలిపివేత


కర్నూలు, ఆంధ్రజ్యోతి: పుష్కర ఘాట్లలో కొవిడ్‌ పరీక్షలపై తేడా కొడుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలు పొంతన కుదరడంలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు 99వేల మందికి పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్యశాఖ చెబుతుండగా.. 65,288 మందికి పరీక్షలు చేసినట్లు సమాచారశాఖ వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండు లెక్కలపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరేశ్వరస్వామి ఘాట్‌లోని ఉద్యోగికి తొలి పాజిటివ్‌ కేసు నమోదవ్వడంతో విధుల్లో ఉన్న సిబ్బంది మొత్తం పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని 23 ఘాట్లలో పోలీసు, ఆరోగ్య, వార్డు వలంటీర్లు తదితర విభాగాలకు చెందిన వందలాది మంది సిబ్బందికి విడతల వారీగా టెస్టులు చేస్తున్నారు. పనిలో పనిగా పుష్కరాలకు వచ్చిన భక్తులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌లు చేయిస్తున్నారు. ఆరు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పుష్కరాలకు అంతంత మాత్రంగానే భక్తులు వస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే థర్మల్‌ టెస్ట్‌లు మాత్రం 99,227 మంది భక్తులకు చేసినట్లుగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తద్వారా పుష్కరాలకు భారీగా భక్తులు వచ్చారని ప్రకటించడమే ధ్యేయంగా ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అందులో ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా పాజిటివ్‌ నమోదు కాలేదని ప్రకటించారు. ఈ సిబ్బందిలో 90 శాతం కడప, అనంతపురం నుంచి పుష్కర విధులకు వచ్చిన వారే కావడం గమనార్హం. 


పుష్కరాల్లో నదీ స్నానాలకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయం ప్రజల నుంచి వచ్చింది. దీంతో ప్రభుత్వం నిబంధనలను సవరించింది. పలు ఘాట్లలో భక్తులు నదీ స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే విధుల్లో ఉన్న కొందరు పోలీసులకు ఇటీవల పాజిటివ్‌ నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. వారిలో 90 శాతం ఇతర ప్రాంతాల వారే అయినా ఆరు రోజులుగా స్థానిక ఉద్యోగులతో కలిసి పనిచేస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అందరికీ పరీక్షలు నిర్వహించింది. పోలీసు అధికారులు 5 వేల మంది, వైద్య, ఆరోగ్య శాఖ నుంచి 250-300 మంది, పారిశుధ్య విభాగం నుంచి సుమారు 600 మంది విధులు నిర్వర్తిస్తుండగా 12 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరందరికీ అధికారులు పరీక్షలు చేయించారు. అయితే జిల్లా వ్యాప్తంగా సిబ్బంది, భక్తులు 99వేల మందికి పరీక్షలు చేశామని వైద్యశాఖ.. 65,288 మందికి టెస్టులు చేశామని సమాచారశాఖ చెబుతున్నాయి. ఈ లెక్కలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంకల్‌బాగ్‌ సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిలిపివేయాల్సిందిగా జేసీ ఖాజా మొహిద్దీన్‌ బుధవారం ఆదేశించారు. దీనికి కారణాలు చెప్పలేదు. నిర్వాహకులు మాత్రం కొవిడ్‌ కారణంగానే నిలిపివేశారని అంటున్నారు. 


వెల్లడి కాని ఫలితాలు

కొన్ని ఘాట్ల వద్ద స్నానాలకు వస్తున్న భక్తులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. అధికారికంగా మాత్రం భక్తుల టెస్ట్‌లపై ఎలాంటి సమాచారం లేదు. నాలుగు రోజులుగా ఎంత మంది భక్తులకు టెస్ట్‌లు చేసిందీ వైద్య, ఆరోగ్య శాఖ నోరు మెదపడం లేదు. మంగళవారం జరిపిన టెస్టుల్లో సంకల్‌బాగ్‌కు వచ్చిన ఓ భక్తుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో కేవలం ఉద్యోగులకే పరీక్షలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2020-11-26T06:51:51+05:30 IST