టీడీపీ కీలకనేత అరెస్ట్

ABN , First Publish Date - 2020-03-13T11:43:59+05:30 IST

నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నాయకుడు..

టీడీపీ కీలకనేత అరెస్ట్

టార్గెట్‌ సుబ్బారెడ్డి

టీడీపీ కీలక నాయకుడి ఇంట్లో సోదాలు

అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింపు

కత్తులు, ఇనుపరాడ్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామంటున్న పోలీసులు

పోలీసుస్టేషన్‌కు సోమిశెట్టి, కేఈ ప్రతాప్‌


డోన్‌(కర్నూలు): డోన్ నియోజకవర్గంలో టీడీపీ ముఖ్య నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డిని అధికార పార్టీ నాయకులు టార్గెట్‌ చేశారు. స్థానిక ఎన్నికల్లో కీలకంగా ఉన్న ఆయనపై గురి పెట్టారు. డోన్‌ పట్టణం నెహ్రూ నగర్‌లో ఉన్న ఆయన ఇంటికి గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీసులు వెళ్లారు. గంటన్నర పాటు సోదాలు నిర్వహించారు. సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్‌ఐలు, 30 మంది పోలీసు సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. సెల్ఫ్‌లో ఉన్న రెండు డాల్‌ కత్తులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌కు సంబంధించిన 20 బుల్లెట్లను సీజ్‌ చేశారు. కారులో ఉన్న స్టెప్నీ రాడ్‌ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ధర్మవరం సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

 

జిల్లా నాయకుల పరామర్శ

ధర్మవరం సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ డోన్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారెడ్డిని పరామర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అంతకు ముందు సీఐ సుబ్రమణ్యంతో వారు భేటీ అయ్యారు. తమ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని అన్నారు. విపక్ష నాయకులను పోలీసులే భయబ్రాంతులకు గురిచేస్తే ఎలా అని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా పనిచేయడం వల్ల తమ పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమని, ఎన్నికలు  ప్రశాంతంగా జరిగేలా చూడాలని సీఐని కోరారు. తమ పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే చంద్రబాబు వచ్చి ధర్నా చేస్తారని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు.


తరలివచ్చిన టీడీపీ శ్రేణులు

టీడీపీ ముఖ్య నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం తెలుసుకుని టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి, గ్రామాల నుంచి కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలతో పోలీస్‌ స్టేషన్‌ కిటకిటలాడింది. దీంతో పోలీసులు వారిని బయటకు పంపించారు.  


రిమాండ్‌కు తరలింపు

డోన్‌ టీడీపీ ముఖ్య నాయకుడు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ ధర్మవరం సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. గురువారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ సుబ్రహ్మణ్యం ఈ వివరాలను వెల్లడించారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆదేశాల మేరకు సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించామన్నారు. మొదటి హాల్‌ ఆల్మారాలో రెండు పదునైన కత్తులు, మరో ఆల్మారాలో పిడిబాకు, ఇనుపపైపు స్వాధీనం చేసుకున్నామన్నారు. 20 రౌండ్ల బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరణాయుధాలు కలిగిఉండటంతో సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశామన్నారు. డోన్‌కు కోర్టు జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. 


బహుమానంగా ఇచ్చిన డాల్‌ కత్తులవి: ధర్మవరం సుబ్బారెడ్డి

15 ఏళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఇతరులు బహుమానంగా ఇచ్చిన కత్తులని, వాటిని పట్టుకుని కేసులు నమోదు చేయడం అన్యాయమని టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. గురువారం డోన్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ఇంట్లో పోలీసులు సోదాలు చేసుకోవచ్చని, అయితే షోకేజ్‌లో పెట్టిన బహుమానం డాల్‌ కత్తులను పట్టుకుని మరణాయుధాలు కలిగి ఉన్నట్లు కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. గన్‌లైసెన్స్‌ రెన్యువల్‌ కాకపోవడంతో కోర్టును ఆశ్రయించానన్నారు. 20 బుల్లెట్లు తన వద్దే ఉన్నాయన్నారు. తన కుమారుడి పెళ్లికి తీసుకున్న కత్తిని పీడిబాకుగా చూపించడం తగదన్నారు. పోలీసులు ఏకపక్షంగా పని చేయడం మానుకోవాలన్నారు. 

Updated Date - 2020-03-13T11:43:59+05:30 IST