నది నాశనం

ABN , First Publish Date - 2020-09-06T09:37:22+05:30 IST

నదుల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఆత్మకూరు పట్టణ శివార్లలో ప్రవహిస్తున్న భవానాశి నది దుస్థితి. పవిత్రమైన

నది నాశనం

భవనాశిలో మున్సిపాలిటీ చెత్త

ఆత్మకూరు అధికారుల నిర్లక్ష్యం

సప్తనదుల్లో ఒకటి.. ఇలాగైంది

నది పరిరక్షణకు ఉద్యమ బాట


ఆత్మకూరు, సెప్టెంబరు 5: నదుల ప్రాధాన్యంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఆత్మకూరు పట్టణ శివార్లలో ప్రవహిస్తున్న భవానాశి నది దుస్థితి. పవిత్రమైన నదిని మున్సిపాలిటీ డంప్‌ యార్డుగా మార్చారు. ఒకప్పుడు వరద జలాలతో పరవళ్లు తొక్కిన భవనాశి.. నేడు మున్సిపాలిటి వ్యర్థాలతో దుర్గంధభరితంగా మారిపోయింది. 


ఆ భూమి కోసం..

ఆత్మకూరు పట్టణ శివార్లలో భవనాశి ఒడ్డున ఓ వ్యక్తికి ఎకరన్నర పొలం ఉండేది. 30 ఏళ్ల క్రితం ఆ భూమిలోని మట్టిని ఇటుకల తయారీకి అమ్ముకున్నారు. దీంతో ఆ ప్రదేశం కూడా నదిలో కలిసిపోయింది. ప్రస్తుతం ఆత్మకూరులో భూముల ధరలు పెరగడంతో ఆ భూమిని తిరిగి దక్కించుకునేందుకు భూమి యజమాని మున్సిపల్‌ అధికారులకు చెత్త నిల్వలు చేసుకోవాలని సూచించారు. ముందూ వెనుకా ఆలోచించకుండా మున్సిపల్‌ అధికారులు ఆరు నెలలుగా చెత్తను ట్రాక్టర్ల ద్వారా భవనాశి నదిలో డంపింగ్‌ చేస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురియడంతో భవనాశి ఉధృతంగా ప్రవహించింది. ఇప్పుడు కూడా భవనాశిలో నీరు పారుతోంది. కానీ చెత్త డంపింగ్‌ వల్ల నదీ జలాలు కలుషితమై ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. 


జల కాలుష్యం

మున్సిపల్‌ అధికారుల నిర్వాకం నదీ జలాలు కలుషితమయ్యాయి. రంగు మారి మురుగునీటిని తలపిస్తున్నాయి. ఫ్లాస్టిక్‌ కవర్లు నీటిపై తేలియాడుతున్నాయి. ఎక్కడబడితే అక్కడ పాచి పేరుకుపోయింది. నది ఒడ్డునే పట్టణానికి తాగునీరు అందించే బోరు ఉంది. ఆ నీరు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదిలో నీటి కాలుష్యం కారణంగా జలచరాల ఉనికికి ముప్పు కలుగుతోంది.


మత్స్య సంపద దెబ్బతింటోంది. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాల మీదుగా సంగమేశ్వరం వరకు ప్రవహించే భవనాశి నదిలో పశుపక్షాదులు దాహార్తి తీర్చుకుంటాయి. కలుషిత నీటిని తాగితే వాటికి ప్రాణహాని తప్పదు. చెత్త నిల్వలకు నిప్పు పెట్టడం వల్ల కొత్తపల్లి - ఆత్మకూరు మండలాల మధ్య రహదారిపై పొగ కమ్ముకుంటోంది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.


సప్తనదుల్లో ఒకటి..

చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న సప్తనదీ సంగమేశ్వర క్షేత్రంలో సంగమించే ఏడు నదుల్లో భవనాశి ఒకటి. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహరణి, భీమరథి.. ఈ ఆరు స్ర్తీ నదులు అలంపూర్‌ వద్ద సంగమించి సంగమేశ్వరానికి ప్రవహిస్తాయి. పురుష నది అయిన భవనాశి మాత్రం లక్ష్మీనరసింహస్వామి సన్నిధి అయిన అహోబిలంలో ఉద్భవించి.. తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఆత్మకూరు శివార్ల మీదుగా వెళ్తోంది.


అక్కడి నుంచి పాములపాడు, కొత్తపల్లి మండలాల మీదుగా ప్రవహించి సంగమేశ్వరంలో కలుస్తోంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న భవనాశిపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. చెత్త నిల్వలతో కలుషితమైన ఇవే జలాలు కృష్ణానదిలో కలుస్తున్నాయి.


భవనాశి పరిరక్షణ దిశగా..

భవనాశి నదిని కలుషితం చేయడం పట్ల స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. కళ్లెదుటే నదీ జలాలు మురుగునీటిగా మారడం చూసి ఆవేదన చెందుతున్నారు. భవనాశి నదిని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మున్సిపాలిటీ చెత్తను నదిలో వేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతున్నారు. చెత్త నిల్వలను నదిలో వేసేందుకు వచ్చిన వాహనాలను శనివారం స్థానికులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్‌ అధికారులు పోలీసులను వెంట పెట్టుకుని మరీ వచ్చారు. అయినా స్థానికులు చెత్తను వేయనీకుండా అడ్డుకున్నారు.


డంపింగ్‌ యార్డు లేనందుకే..

ఆత్మకూరు మున్సిపాలిటీలో డంపింగ్‌ యార్డు లేదు. దీంతో ప్రైవేట్‌ భూమి ఉన్న భవనాశి నదిలో చెత్త నిల్వలు వేయాల్సి వస్తోంది. ఇంతలా కలుషితం జరుగుతుందని ఊహించలేదు. ఇకపై చెత్త నిల్వలను మరోచోటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటాం. భవనాశి నది ప్రక్షాళన అంశాన్ని పరిశీలిస్తాం. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి కరివేన సమీపంలోని సెరికల్చర్‌ డిపార్టుమెంట్‌ భూముల్లో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. 

- వెంకటదాసు, మున్సిపల్‌ కమిషనర్‌, ఆత్మకూరు అపవిత్ర కార్యం.. సప్తనదీ సంగమ ప్రదేశంలో కలిసే ఏడు నదుల్లో ఒకటైన భవనాశి నదిని కలుషితం చేయడం అపవిత్రమైన పని. సంగమేశ్వరంలో కృష్ణా, తుంగభద్ర నదుల పుష్కరాలు జరుగుతాయి. అలాంటి క్షేత్రానికి చేరుకునే జలాల్లో వ్యర్థాలను వేయడం భక్తుల మనోభావాలను కించపరిచినట్లే. భవనాశి నదికి పూర్వ వైభవం తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. - తెలకపల్లి రఘురామశర్మ, సంగమేశ్వర క్షేత్ర పురోహితులు

            - వెంకటదాసు, మున్సిపల్‌ కమిషనర్‌, ఆత్మకూరు 


అపవిత్ర కార్యం.. 

సప్తనదీ సంగమ ప్రదేశంలో కలిసే ఏడు నదుల్లో ఒకటైన భవనాశి నదిని కలుషితం చేయడం అపవిత్రమైన పని. సంగమేశ్వరంలో కృష్ణా, తుంగభద్ర నదుల పుష్కరాలు జరుగుతాయి. అలాంటి క్షేత్రానికి చేరుకునే జలాల్లో వ్యర్థాలను వేయడం భక్తుల మనోభావాలను కించపరిచినట్లే. భవనాశి నదికి పూర్వ వైభవం తెచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- తెలకపల్లి రఘురామశర్మ, సంగమేశ్వర క్షేత్ర పురోహితులు


ఉద్యమం చేపడతాం.. 

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో భవనాశి నది కలుషితమౌతోంది. నదిని పరిరక్షించకపోతే ఉద్యమం చేపడతాం. నదీ జలాలు రంగుమారి దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీనివల్ల పట్టణ ప్రజలకే కాకుండా పశుపక్షాదులకు ముప్పు కలుగుతోంది. 

                                            - శివరామ్‌ యాదవ్‌, ఆత్మకూరు


ఎంత చెప్పినా వినలేదు..

భవనాశి నదిలో చెత్త నిల్వలు వేయవద్దని మున్సిపల్‌ అధికారులకు ఎంత చెప్పినా వినలేదు. ఎండాకాలంలో సమస్య లేకున్నా.. వర్షాలు మొదలు కాగానే నీరు కలుషితమౌతోంది. ఆ నాడు మా మాట వినివుంటే నేడు నది ఇంతలా కలుషితమయ్యేది కాదు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించాలి. 

 - రమణా రెడ్డి, స్థానికుడు.

Updated Date - 2020-09-06T09:37:22+05:30 IST