సీబీఐతో దర్యాప్తు చేయించాలి

ABN , First Publish Date - 2020-11-22T05:12:39+05:30 IST

అబ్దుల్‌ సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ డిమాండ్‌ చేశారు.

సీబీఐతో దర్యాప్తు చేయించాలి
మాట్లాడుతున్న ఎన్‌ఎండీ ఫరూక్‌

  1. అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ప్రభుత్వ హత్యే
  2. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్

నంద్యాల, నవంబరు 21: అబ్దుల్‌ సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సలాం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నాలుగో రోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. దీక్షను సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్‌ ప్రారంభించగా ఆవాజ్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడు మస్తాన్‌వలి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడారు. సీఎం జగన్‌ తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించడానికి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు సలాం కుటుంబ సభ్యులను తీసుకెళ్లగా పరామర్శించి అవుట్‌ సోర్సింగ్‌ పోస్టు, బదిలీ అంశాలపైన మాత్రమే స్పందించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తమ అల్లుడికి అన్యాయం జరిగిందని, కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం వెనుక దోషులను శిక్షించాలని అత్త మాబున్నీసా కోరగా సీఎం జగన్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సలాం సమీప బంధువులైన వారిలో ఒకరికి అవుట్‌ సోర్సింగ్‌ పోస్టు, మరొకరికి ఉద్యోగ బదిలీ విన్నపాలు వారి వ్యక్తిగతమని అన్నారు. సలాం కుటుంబంతో సహా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కారణాలు ఏమిటి, కారణాలను వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ఫరూక్‌ ప్రశ్నించారు. సలాం దోషినా? నిర్దోషినా? అన్న విషయం ప్రపంచానికి తెలియాలన్నారు. పోలీసుల వేధింపులతోనే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. సలాం భార్యను కూడా వేధించడంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అన్నారు. సలాం బంగారం దొంగతనం చేశాడా? 3 కేజీల బంగారం పోయిందా? లేదా?, అప్పటి దోపిడీ గుట్టు బహిర్గతం అయితే తప్ప సలాం కుటుంబానికి న్యాయం జరగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలపై దాడులు, వేధింపులు జరుగుతున్నాయని, బీహార్‌ కన్నా అధ్వాన్నంగా ఏపీలో పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కానిస్టేబుల్‌ గంగాధర్‌ ఫోన్‌ కాల్‌ లిస్టును వెలికి తీస్తే నిజాలు బయ టకొస్తాయన్నారు. సలాం నిర్దోషిగా ప్రకటిస్తేనే న్యాయం జరిగినట్లు అని అ న్నారు. సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ అహమ్మద్‌, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ, ఐయూఎంఎల్‌, కాంగ్రెస్‌ నాయకులు, పలు ముస్లిం సంఘాలు, ఎంఐఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more