ఓటమి భయంతోనే దౌర్జన్యం: సోమిశెట్టి

ABN , First Publish Date - 2020-03-13T11:57:26+05:30 IST

డోన్‌ నియోజకవర్గంలో ఓటమి భయంతో ఆర్ధిక మంత్రి బుగ్గన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

ఓటమి భయంతోనే దౌర్జన్యం: సోమిశెట్టి

డోన్‌, మార్చి 12: డోన్‌ నియోజకవర్గంలో ఓటమి భయంతో ఆర్ధిక మంత్రి బుగ్గన దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. గురువారం పట్టణంలోని కేఈ స్వగృహంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌, గొర్రెల పెంపకందారుల సంఘం ఛైర్మన్‌ వై.నాగేశ్వరరావు యాదవ్‌తో కలిసి అయన విలేఖరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ దౌర్జన్య పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని బీహార్‌లా మార్చారని మండిపడ్డారు. డోన్‌ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డిపై ఆక్రమ కేసులు బనాయించి ఆరెస్టు చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఓడిపోతామన్న భయంతోనే మంత్రి బుగ్గన పోలీసులను అడ్డంపెట్టుకుని గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెంబర్‌ 2 అని చెప్పుకుంటున్న బుగ్గనకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలవలేమని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివస్తాదేమోనని నామినేషన్లు వేస్తున్న తమ పార్టీ అభ్యర్ధులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ మాట్లాడుతూ ప్రజాస్మామ్యాన్ని ఖూనీ చేసేలా స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటాన్నారు.


ప్రజలు తిరగబడి వైసీపీ నాయకులను తరిమికొట్టే రోజులు తొందర్లోనే ఉన్నాయన్నారు. ధర్మవరం సుబ్బారెడ్డి ఇంట్లో డాల్‌కత్తులు దొరికితే అక్రమ కేసులు పెట్టి ఆరెస్టు చేయడం చాలా అన్యాయమన్నారు. పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తూ టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. మంత్రి బుగ్గన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికల్లో గెలిచినా హైకోర్టులో పిటీషన్లు వేసి మళ్లీ ఎన్నికలు జరిపేలా పోరాడుతామన్నారు. సమావేశంలో మార్కెట్‌యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మురళీక్రిష్ణగౌడ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కోట్రికె ఫణిరాజ్‌ , తిమ్మయ్య యాదవ్‌, గౌతమ్‌కుమార్‌రెడ్డి, చిట్యాల మద్దయ్యగౌడ్‌, సింగిల్‌విండో మాజీ ఛైర్మన్‌ సోమేష్‌యాదవ్‌, వెంకటనాయునిపల్లె శ్రీను, తాడురు వెంకటరమణయ్య, అబ్డిరెడ్డిపల్లె గోవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T11:57:26+05:30 IST