సలాం కేసును సీబీఐకి ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-11-16T05:27:24+05:30 IST

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐతో కానీ, జుడీషియరీతో కానీ విచారణ జరిపించాలని, అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

సలాం కేసును సీబీఐకి ఇవ్వాలి
సలాం కుటుంబాన్ని పరామర్శిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

  1. న్యాయ పోరాటానికి రాష్ట్ర వ్యాప్త  మద్దతు  
  2. సీఎం జగన్‌ స్పందించకపోవడం దారుణం 
  3. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

నంద్యాల (ఎడ్యుకేషన్‌), నవంబరు 15: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసును సీబీఐతో కానీ, జుడీషియరీతో కానీ విచారణ జరిపించాలని, అప్పుడే  వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. సలాం కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన లో జరుగుతున్న ఆందోళనకు రాష్ట్ర వ్యాప్త మద్దతు వప్తోందని అన్నారు.  అక్రమ కేసులు బనాయించి సుదీర్ఘకాలం పోలీసులు సలాంను వేధించడంతోనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బంగారు షాపు యజమాని పోలీసులను ప్రలోభపెట్టారని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ వేధించడంతో వారిపై కేసు నమోదు చేసి బెయిలబుల్‌ సెక్షన్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. పోలీసులే నిందు లైనప్పుడు వారితోనే విచారణ ఏవిధంగా జరిపిస్తారని ప్రశ్నించారు. సీఐ, హెడ్‌కానిస్టేబుళ్లను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయాలని డిమాం డ్‌ చేశారు. జగన్‌ ప్రభుతంలో 18 నెలల కాలంలో దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో దళితులను, మైనార్టీలపై పోలీసులు కూడా వేధిస్తుండడం అన్యాయమని అన్నారు. దాడులపై, వేధింపులపై సీఎం జగన్‌ ఏమీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. మనుషుల ప్రాణాలు పోయిన తర్వాత చెక్కులు పంపి ణీ చేయడమేనా? మీ పాలన అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. సలాం కుటుంబం ఆత్మహత్య వెనుక పెద్ద కథ ఉందని, న్యాయం చేసేదాకా పోరాడతామని అన్నారు. 

చాగలమర్రి: నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య సంఘటన ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్‌బాషా అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణమైన పోలీసులకు రెండు రోజుల్లోనే బెయిల్‌ రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. 

Updated Date - 2020-11-16T05:27:24+05:30 IST