కోవిడ్‌ ఆసుపత్రులు సిద్ధం

ABN , First Publish Date - 2020-04-01T10:42:24+05:30 IST

కరోనా సోకిన వారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం జిల్లాలోని శాంతిరాం, విశ్వభారతి మెడికల్‌ కాలేజీల్లో కోవిడ్‌-19 ఆసుపత్రులను సిద్ధం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

కోవిడ్‌ ఆసుపత్రులు సిద్ధం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

 ఆర్‌యూ క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు


కర్నూలు(హాస్పిటల్‌)/కర్నూలు(ఆంధ్రజ్యోతి), మార్చి 31: కరోనా సోకిన వారికి వైద్యం చేయడానికి ప్రభుత్వం జిల్లాలోని శాంతిరాం, విశ్వభారతి మెడికల్‌ కాలేజీల్లో కోవిడ్‌-19 ఆసుపత్రులను సిద్ధం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగర శివారులో ఉన్న రాయలసీమ యూనివర్సిటీలోని క్వారంటైన్‌ కేంద్రాన్ని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి పరిశీలించారు. కరోనా వైద్య చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి బుగ్గన అన్నారు. రాయలసీమ యూనివర్సిటీతో పాటు జిల్లాలోని అన్ని క్వారంటైన్‌, రిలీఫ్‌ క్యాంప్‌లో ఉన్న వారికి జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం ఇవ్వాలని ఆదేశించారు.


ఢిల్లీ నుంచి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారికి ఐసొలేషన్‌, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు హోం ఐసొలేషన్‌, పీరియడ్‌ పూర్తి అయ్యేంతవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ కరోనా వ్యాధి కట్టడి కోసం ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. క్వారంటైన్‌లో అందుతున్న సేవలను, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీ రవిపట్టన్‌ శెట్టి, డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య పాల్గొన్నారు. 


ధైర్యంగా పని చేయాలి వైద్యులకు మంత్రి బుగ్గన సూచన

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకొందనీ, వైద్యులు ధైర్యంగా విధులు నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని ధన్వంతరి హాల్‌లో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఇది విపత్తు సమయమని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కఠిన చర్యలు చేపట్టారన్నారు.


వైద్యులు, సిబ్బంది ధైర్యంగా పని చేయాలన్నారు. కరోనా కట్టడికి నిధుల కొరత లేదని, మందులు, మాస్కులు ఇస్తామని అన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ల్యాబ్‌కు కృషి చేస్తానని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమీక్షలో కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.జీఎ్‌స రాంప్రసాద్‌, డిప్యూటీ సూపరింటెండెంట్లు డా.కె.నరసింహులు, సీఎ్‌సఆర్‌ఎంవో డా.శ్రీహరి, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో డా.హేమనళిని, వైద్యులు పాల్గొన్నారు. 


అనంతరం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయారం జయరాం కలెక్టర్‌ జి. వీరపాండియన్‌, డీఐజి వెంకట్రామిరెడ్డి, ఎస్పీ ఫకీరప్పతో సమీక్ష నిర్వహించారు. 

Updated Date - 2020-04-01T10:42:24+05:30 IST