నిరుపేదలకు నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-05T09:57:21+05:30 IST

కరోనా చుట్టుముట్టిన వేళ అనాథలు, పేదలు, రోజువారీ పనులు చేసుకొని జీవించేవారు సంక్షోభంలో పడిపోయారు.

నిరుపేదలకు నిత్యావసరాలు, కూరగాయల పంపిణీ

సహాయ నిధికి విరాళాలు


కరోనా చుట్టుముట్టిన వేళ అనాథలు, పేదలు, రోజువారీ పనులు చేసుకొని జీవించేవారు సంక్షోభంలో పడిపోయారు. సమాజంలో మానవత్వం ఉన్న వారంతా విశాల హృదయంతో సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అన్నం,  కూరగాయలు పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధికి పలువురు విరాళం అందించారు. 


ఆంధ్రజ్యోతి, (న్యూస్‌ నెట్‌వర్క్‌), ఏప్రిల్‌ 4: కరోనా (కోవిడ్‌-19) విపత్తు నియంత్రణ  చర్యల కోసం కర్నూలు జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటేశ్వర రెడ్డి, హౌసింగ్‌ శాఖ సిబ్బంది   రూ. 1,24,116 చెక్కును కలెక్టర్‌ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్‌ జి. వీరపాండియన్‌కు అందించారు. జిల్లా పంచాయతీ  రాజ్‌ శాఖ తరఫున  ఎస్‌ఈ కె. సుబ్రహ్మణ్యం లక్ష రూపాయల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. అలాగే పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రమణయ్య ఆ శాఖ సిబ్బందితో కలిసి రూ. 1.5 లక్షల  చెక్కును, ఐసీడీయస్‌ శాఖ సిబ్బంది సేకరించిన రూ. 2,55,555 చెక్కును కలెక్టర్‌కు అందించారు. 


కరోనా వైరస్‌ నిర్మూలనలో విశేష సేవలందిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటు వైసీపీ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నదానం చేశారు. శనివారం 19వ వార్డు వైసీపీ నాయకులు సుభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌పోస్టులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.   పోలీసులు, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లకు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు. 


కర్నూలు ఇండస్ట్రియల్‌ చైర్మన్‌ రామకృష్ణారెడ్డి, కాస్మో పాలిటన్‌ కల్చరల్‌ సెంటర్‌ నిర్వాహకులు  శనివారం    ఎస్పీ ఫక్కీరప్ప, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు 500 మాస్కులు, 1200 శానిటైజర్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.  


కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల కోసం   సీఎం సహాయనిధికి మెప్మా సిబ్బంది రూ.లక్ష చెక్కును నందికొట్కూరు మున్సిపల్‌ కమిషనర్‌ అంకిరెడ్డికి శనివారం అందజేశారు.   మెప్మా సిటీ మేనేజర్‌ ప్రమీల మాట్లాడుతూ పట్టణంలో పొదుపు మహిళల నుంచి రూ.10 చొప్పున   39 ఐక్య సంఘాల నుంచి రూ.లక్ష సేకరించామని తెలిపారు. 


ఎమ్మిగనూరు పట్టణంలోని పేద కుటుంబాలకు వైద్యురాలు నాగరాజకుమారి, రిటైర్డ్‌ డీఈఈ నాగేశ్వరరావు, సాయి రాఘవేంద్ర మెస్‌ నిర్వాహకుడు సాయినాథ్‌ నిత్యావసరాలు, కూరగాయలు అందించారు.   పట్టణానికి చెందిన ఉషాహోటల్‌ నిర్వాహకులు  రామస్వామి అనాథలు,  ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులు,  వారి బంధువులకు,    అనాథలకు పెరుగన్నం పంపిణీ చేశారు.   ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వేదాస్‌ స్వచ్ఛందసేవా సంస్థ నిర్వాహకుడు  సునీల్‌ కుమార్‌కు 3000 డెటాల్‌ సబ్బులను అందజేశారు.


  పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు దయాసాగర్‌, మధుబాబు  పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పలువురికి బాదంపాలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన 117 కుటుంబాలకు యూటీఫ్‌ ఆద్వర్యంలో పట్టణ సీఐ శ్రీధర్‌ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.   పట్టణంలోని భగీరథ ఉప్పర యవజన సంఘం నాయకులు వీరేంద్ర అధ్వరంలో పట్టణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు,  వలంటీర్లు, అనాథలు, వృద్ధ్దులు, నిరుపేదలకు భోజనం పాకెట్లు పంపిణీ చేశారు.


కరోనా నియంత్రణ సహాయ నిధికి   ఎమ్మిగనూరు మెప్మా ఆధ్వర్యంలో  శనివారం రూ.లక్ష చెక్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డికి  అందించారు. ఈసందర్భంగా కమిషనర్‌ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి పొదుపు మహిళ రూ.10 ఇవ్వడం అభినందనీయమన్నారు.  


ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు గ్రామంలో దాతలు నడిపిఖాశీం, చిన్న ఉమామ్‌ ఉశేన్‌  శనివారం గ్రామంలోని 300 కుటుంబాలకు   కూరగాయలను పంపిణీ చేశారు.   రోజువారి కూలీలను ఆదుకొనేందుకు ఈ సాయం చేశామని వారు తెలిపారు.  


లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు శనివారం దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. కొలిమిగుండ్లలో రవిప్రకాష్‌గౌడ్‌, బెలుం గ్రామంలో రామ్మోహన్‌రెడ్డి  పట్టణంలోని ఎర్రబోతుల కార్యాలయంలో జడ్పీటీసీ ఎర్రబోతుల వెంకటరెడ్డి చేతుల మీదుగా పేదలకు, దినసరి కూలీలకు, హమాలీలకు కూరగాయలను రవిప్రకాష్‌గౌడ్‌ పంపిణీ చేశారు.  బెలుంలో ఎస్‌ఐ హరినాథ్‌రెడ్డి చేతుల మీదుగా రామ్మోహన్‌రెడ్డి గ్రామంలోని పేదలందరికి కూరగాయలు పంపిణీ చేయించారు.  


చాగలమర్రి మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా సమీపంలో 41వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగిస్తున్న డ్రైవర్లు, క్లీనర్లకు శనివారం ఎస్‌ఐ పీరయ్య పర్యవేక్షణలో సీపీవోలు భోజన ప్యాకెట్లను అందజేశారు. దాతల సహకారంతో లాక్‌డౌన్‌ కొనసాగించే వరకు హైవే రహదారిపై వాహనదారులు, యాచకులు, అనాథలకు భోజన ప్యాకెట్లు అందజేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  


లాక్‌డౌన్‌తో ఆకలితో  అల్లాడుతున్న వారిని  గుర్తించి శనివారం అన్నదానం చేసినట్లు ఆళ్లగడ్డ తాలుకా బ్రాహ్మణ సంఘం నాయకుడు  సుబ్బయ్య, కార్యదర్శి సుబ్బారావు తెలిపారు. పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో నివసిస్తున్న పేదలు   150 మందికి భోజన పొట్లాలను అందించారు. అహోబిలంలోని పద్మశాలియ అన్నదాన సత్రంలో పేదలకు అన్నదానం చేసినట్లు   నిర్వాహకుడు ఎర్రనాగు పద్మనాభుడు శనివారం తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ కార్యక్రమం ముగిసే వరకు ప్రతి రోజూ ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.  


నంద్యాల గుడిపాటిగడ్డలోని  స్వామి అయ్యప్ప దేవాలయ సేవా సమాజం ఆధ్వర్యంలో కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయ నిధికి రూ.లక్ష నగదును ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డికి  శనివారం అందజేశారు. అలాగే విక్టోరియా రీడింగ్‌ రూమ్‌ తరపున రూ.50 వేలు చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. పట్టణానికి చెందిన హుసేన్‌రెడ్డి రూ.20 వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎమ్మెల్యే శిల్పాకు అందజేశారు.  


కరోనా వైరస్‌ నివారణ సహాయ నిధికి పత్తికొండ పట్టణానికి చెందిన చిన్నారులు తాము దాచుకున్న హుండీ డబ్బులు రూ.2వేలు  శనివారం ఎమ్మెల్యే శ్రీదేవికి అందించారు.  పట్టణంలోని టీచర్‌కాలనీకి చెందిన హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆలీ కూతురు అయేరాఆప్సీన్‌  తన హుండీలోని డబ్బును  తండ్రితో కలిసి  అందజేసింది.  


నంద్యాల పట్టణంలోని 24వ వార్డు మాజీ కౌన్సిలర్‌ దిలీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంతో తన వార్డులోని 330 పేద కుటుంబాలను గుర్తించి రూ.1.70 లక్షల ఖర్చుతో నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. త్రీటౌన్‌ సీఐ శివశంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై పేదలకు కిట్లను పంపిణీ చేశారు.  


నంద్యాల కాంగ్రెస్‌ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 15వ వార్డులో ప్రజలకు శానిటైజర్లను పంపిణీ చేశారు. 8వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త అజయ్‌ కుటుంబానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతలమోహన్‌రావు, జిల్లా కార్యదర్శి చింతలయ్య నిత్యావసర వస్తువులను అందజేశారు.  


లాక్‌డౌన్‌   సందర్భంగా నిరుపేదల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఎస్‌డీపీఐ ఆధ్వర్యంలో 130 నిరుపేద కుటుంబాలకు వంట సామగ్రిని పంపిణీ చేసినట్లు   ఆలూరు అధ్యక్షుడు సలామ్‌, పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర కార్యదర్శి ఇర్ఫాన్‌ శనివారం తెలిపారు.   ఈబీసీ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్‌ అన్వర్‌హుసేన్‌, ప్రాథమిక వైద్యాధికారి హరిచ్చంద్రుడు, పంచాయతీ అధికారి రాజశేఖర్‌, వైసీపీ నాయకుడు సఫీవుల్లా హాజరయ్యారు.  


ఆదోని మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన బాబోడి నారాయణశెట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 200 కుటుంబాలకు శనివారం   కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఒక్కో కుటుంబానికి రూ.100 విలువ చేసే కూరగాయలను పంపిణీ చేశామని తెలిపారు.  

Updated Date - 2020-04-05T09:57:21+05:30 IST