దూరం సారూ!
ABN , First Publish Date - 2020-04-05T09:58:36+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భౌతిక దూరం కీలకం. వ్యక్తిగత స్థాయిలో అందరూ పాటించాల్సిన ఈ లాక్డౌన్ నిబంధన ప్రభుత్వ సాయం పంపిణీలో అమలు కాలేదు.

ఆదోని(అగ్రికల్చర్), ఏప్రిల్ 4: కరోనా వైరస్ నియంత్రణలో భౌతిక దూరం కీలకం. వ్యక్తిగత స్థాయిలో అందరూ పాటించాల్సిన ఈ లాక్డౌన్ నిబంధన ప్రభుత్వ సాయం పంపిణీలో అమలు కాలేదు. ప్రజలను ఆదుకోడానికి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి ప్రభుత్వం సాయం చేస్తోంది. ఈ డబ్బును శనివారం సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందించారు. అయితే వార్డులలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను పక్కకునెట్టి వైసీపీ నాయకులే రూ.వెయ్యి నగదును పంపిణీ చేశారు.
ఆదోని పట్టణంలో ఎంఐజీ, ఎల్ఐజీ, కల్లుబావి, అమరావతినగర్, క్రాంతినగర్, అరుంజ్యోతినగర్‌లో వైసీపీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు రూ. 1000 నగదు పంపిణీ చేశారు. మండలంలోని దిబ్బనకల్లు, సలకలకొండ, బసరకోడు, అలసందగుత్తి గ్రామాల్లో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నగదు పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచారం తరహాలో కలియదిరిగి గుంపులు గుంపులుగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంట వైసీపీ కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంలో భౌతిక దూరం కూడా పాటించకుండా నగదు పంపిణీ చేస్తుండడం చూసి ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా పట్టించుకోలేదు.
ఇట్లా అయితే ఎట్లా?
ఆలూరు, ఏప్రిల్ 4: తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.వెయ్యి నగదు శనివారం వైసీపీ నాయకులు, అధికారులు పట్టణంలోని కాలనీలలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎవ్వరూ భౌతిక దూరం పాటించకుండా జనంలో కలియదిరిగారు. మంత్రి జయరాం సోదరుడు నారాయణస్వామి, ఎంపీడీవో అల్లాబకాష్, ఎస్ఐ శ్రీనివాసులు సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోవడం గమనార్హం.
ఇక్కడా అంతే
నందికొట్కూరు, ఏప్రిల్ 4: నందికొట్కూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆర్థర్ రేషన్ కార్డుదారులకు రూ. వెయ్యి పంపిణీ చేశారు. అయితే ఇక్కడ భౌతిక దూరం పాటించాలనే నిబంధన గాల్లో కలిసింది. పట్టణంలో 12,590 రేషన్‌కార్డుదారులకు రూ.1,25,90,000 పంపిణీ చేయాలి. సర్వర్ మొరాయించడంతో సగం మందికే ఇచ్చారు.
వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులే..
ఎమ్మిగనూరు టౌన్, ఏప్రిల్ 4: ఎమ్మిగనూరు పట్టణంలో 34 వార్డులుండగా శనివారం అనేక చోట్ల వైసీపీ నాయకులు, పార్టీ ఇన్‌చార్జిలే నగదు అందించారు. వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన వారు కూడా రూ.1000 నగదు అందించారు. నాయకుల హడావుడి ముందు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మిన్నకుండి పోయారు.