అందరూ సహకరించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2020-03-24T05:30:00+05:30 IST

కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఆర్డీవో బాలగణేశయ్య, డీఎస్పీ రామకృష్ణ, తహసీల్దార్‌ రామకృష్ణ, ఎంపీడీవో గీతావాణి కోరారు.

అందరూ సహకరించాలి: ఆర్డీవో

ఆదోని రూరల్‌, మార్చి 24: కరోనా నివారణకు అందరూ సహకరించాలని ఆర్డీవో బాలగణేశయ్య, డీఎస్పీ రామకృష్ణ, తహసీల్దార్‌ రామకృష్ణ, ఎంపీడీవో గీతావాణి కోరారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ముస్లిం మతపెద్దలతో వారు చర్చించారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఒకే చోట ఎక్కువ మంది గుమికూడదని, కావున ప్రార్థనలు ఇంట్లోనే ఉండి చేసుకోవాలని సూచించారు. 


 కరోనా వైరస్‌ నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని టూటౌన్‌ సీఐ లక్షుమయ్య ప్రజలను కోరారు. ఈ సందర్భంగా పోలీస్‌ వాహనంలో పట్టణం మొత్తం కలియదిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు సహకరించాలని నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. అలాగే పట్టణంలోని వన్‌, టూ, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు జరిమానాలు విధించారు.


144 సెక్షన్‌ కఠినంగా అమలు

ఆత్మకూరు, మార్చి 23: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఆత్మకూరు పోలీసులు మరింత కఠినంగా అమలు చేశారు. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేందుకు మంగళవారం ఆత్మకూరు పట్టణంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఇదిలా ఉంటే ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు,   సీఐ కళా వెంకటరమణ, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ పట్టణంలోని ప్రధాన రహదారులను పర్యటించి జనాలను ఇళ్లకు పంపించేశారు.  కిరాణం, కూరగాయలు, దుకాణాలు మినహాయిస్తే మిగతా వాటిని మూసివేయించారు. బుధవారం ఉగాది పర్వదినం ఉండటం వల్ల జనం కిరాణం దుకాణాల వద్దకు వచ్చి సరుకులు కొనుగోలు చేశారు. 


శిరివెళ్ల

కరోనా నివారణకు ప్రభుత్వ నిబంధనలను ప్రజలు అతిక్రమించరాదని శిరివెళ్ల సర్కిల్‌ సీఐ బీవీ విక్రమసింహ అన్నారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా కఠనంగా అమలు చేస్తున్న 144-సెక్షన్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ తిమ్మారెడ్డి, ఏఎ్‌సఐ మౌళిబాషా, సిబ్బంది ఉన్నారు. 


సి.బెళగల్‌: సి.బెళగల్‌ మండలంలో కరోనా నివారణకు ప్రజలు ఇళ్లనుంచి బయటికి రాకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. దీంతో ప్రజలు బయటికి  రావడం లేదు. కరోనా వైరస్‌ ప్రభావంతో గ్రామీణ ప్రాంతాలలో ఉగాది పండుగ ఊసేలేదు. 


కోడుమూరు

కరోనా వైరస్‌ ప్రబలకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని సీఐ పార్థసారథిరెడ్డి కోరారు. మంగళవారం స్థానిక ప్రధాన రహదారుల్లో మైక్‌ ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనవసరంగా ప్రజలు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని అన్నారు. 144 సెక్షన్‌ అమలులో ఉందని గుంపులుగుంపులుగా జనం కనిపిస్తే లాఠిచార్జ్‌ చేసామని హెచ్చరించారు. కార్యక్రమంలో డార్టర్‌ ప్రకాష్‌, ఎంపీడీవో మంజులవాణి, పంచాయతీ ఈవో వెంకటేశ్వర్లు, వీఆర్‌వో ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


గోస్పాడు

ఎవరూ రోడ్లపై తిరగకుండా ఇళ్లకే పరిమితం కావాలని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు అన్నారు.  మంగళవారం మండలంలోని అన్ని గ్రామాలలో పరిస్థితులు చూశామని అన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రాకూడదని అన్నారు. అలాగే 144 సెక్షన్‌ను అతిక్రమించిన 9 ఆటోలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. 


బేతంచెర్ల

కరోనా వైరస్‌ నివారణకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని  సీఐ పీటీ కేశవరెడ్డి కోరారు. మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇళ్లు వదిలి బయటికి రావద్దన్నారు. నిత్యావసర వస్తువుల అంగళ్లు మాత్రమే తెరిచి ఉంటాయన్నారు.  


శ్రీశైలం

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌ డౌన్‌ ప్రకటించింది. అలాగే 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. దీంతో నల్లమల ఘాట్‌ రోడ్డులో శ్రీశైలం-దోర్నాల నిత్యం వందలాది వాహనాలతో రాకపోకలు సాగిస్తాయి. రాకపోకలను రద్దు చేయడంతో ప్రస్తుతం నల్లమల ఘాట్‌రోడ్డు నిర్మానుష్యంగా మారింది. 


గూడూరు

కరోనాను కట్టడి చేసేందుకు పోలీసులు గూడూరు పట్టణాన్ని దిగ్బంధం చేశారు. మంగళవారం ఎస్‌ఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు.  ప్రజలు బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పండుగలు, ఫంక్షన్లు, వివాహాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. 


క్రిష్ణగిరి

కరోనాకు వ్యతిరేకంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రజలు రోడ్ల మీదకు అధికంగా రావడంతో 144సెక్షన్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో మంగళవారం గ్రామాలతో పాటు క్రిష్ణగిరిలో కూడా 144సెక్షన్‌ను అమలు చేస్తూ సోమవారం కన్నా మంగళవారం ప్రజలు రోడ్లపైకి తక్కువగా వచ్చారు. ఉగాది పండుగ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. అయితే అత్యవసరమైతే తప్ప ఇళ్లలోనుంచి ప్రజలు బయటకు రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-24T05:30:00+05:30 IST