ఆదోనిలో కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2020-05-29T10:33:42+05:30 IST

జిల్లాలో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆదోని పట్టణంలో 9, కర్నూలులో ..

ఆదోనిలో కరోనా ఉధృతి

ఒకేరోజు 9 కేసులు.. మొత్తం 40పైనే..

ఒకరు మృతి.. 22కి చేరిన మృతుల సంఖ్య


కర్నూలు(హాస్పిటల్‌)/ఆదోని, మే 28: జిల్లాలో మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆదోని పట్టణంలో 9, కర్నూలులో మూడు, కోసిగిలో మూడు ఉన్నాయి. జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 680కి చేరింది. కొవిడ్‌ చికిత్స పొందుతున్న వారిలో ఒకరు గురువారం మృతి చెందారు. ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 22కు చేరింది. ఆదోని పట్టణంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ నెల ఒకటో తేదీ వరకు ఆదోనిలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.


మే 2న మొదటి కేసు నమోదైంది. మే 15 నుంచి వలస కార్మికులు, కోయంబేడు కాంటాక్టుల కారణంగా కేసులు ఎక్కువయ్యాయి. మే 18న ఒకే కుటుంబంలో ముగ్గురికి వైరస్‌ సోకింది. 26న ఐదుగురికి, 27న ఏడుగురికి, 28న 9 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇలా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 40పైనే కేసులు నమోదయ్యాయి. ఆదోని డివిజన్‌లోని ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు, కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పత్తికొండ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఆరోగ్య కార్యకర్తకు పాజిటివ్‌

కోసిగిలో కొత్తగా మూడు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఇందులో ఓ ఆరోగ్య కార్యకర్త (మహిళ), వార్డు వలంటీరు ఉన్నారు. కోసిగి మండలం దొడ్డి బెళగల్‌లో ఓ వలస కార్మికునికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో కోసిగిలో పాజిటివ్‌ల సంఖ్య ఐదింటికి చేరింది.


21 మంది డిశ్చార్జి

జిల్లాలో మరో 21 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రి, విశ్వభారతి కొవిడ్‌ ఆసుపత్రి, హోం ఐసోలేషన్‌ నుంచి 21 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. దీంతో జిల్లాలో కోలుకున్న వారి సంఖ్య 597కు  చేరింది. తాజాగా డిశ్చార్జ్‌ అయిన వారిలో కర్నూలు నగరవాసులు 19 మంది, ఆదోని, బనగానపల్లెలో ఒక్కొక్కరు ఉన్నారు. 

Updated Date - 2020-05-29T10:33:42+05:30 IST