1124 మందికి పాజిటివ్‌.. కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 16,847

ABN , First Publish Date - 2020-08-01T19:08:32+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం 1124 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,847కు చేరింది. గత నాలుగు రోజులుగా నిత్యం వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు

1124 మందికి పాజిటివ్‌.. కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 16,847

8 మంది మృతి


కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. శుక్రవారం 1124 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 16,847కు చేరింది. గత నాలుగు రోజులుగా నిత్యం వెయ్యికి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. పాజిటివ్‌ కేసుల్లో 8575 యాక్టివ్‌ కేసులుకాగా 8077 మంది డిశ్చార్జి అయ్యారు. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ట్రునాట్‌, ఆర్‌టీపీసీఆర్‌ కిట్ల ద్వారా 600 మందికి, రాపిడ్‌ కిట్ల ద్వారా 518 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ చేశారు. 


200కు చేరువలో కరోనా మరణాలు

జిల్లాలో కరోనా మరణాలు 200కు చేరువయ్యాయి. శుక్రవారం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 195కు చేరింది. గత ఆరు రోజుల్లో 39 మంది కరోనా బాధితులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మరణాల్లో అత్యధిక శాతం కర్నూలు జీజీహెచ్‌లో సంభవిస్తున్నాయి.


ముఖ్య అధికారికి కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స

జిల్లాలోని ఓ ముఖ్య అధికారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన శుక్రవారం ఉదయం కర్నూలు జీజీహెచ్‌లోని పేయింగ్‌ బ్లాక్‌లో చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్యులు ఆ అధికారికి కొన్ని ముఖ్య సూచనలు చేశారు. పాజిటివ్‌ వచ్చిన అధికారి కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులచే చికిత్స చేయించుకోవడంతో అందరూ ఆయన్ను ప్రశంసిస్తున్నారు. కర్నూలు జీజీహెచ్‌లోని ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 

Updated Date - 2020-08-01T19:08:32+05:30 IST