ఒక నెల.. 14,864 కేసులు.. 129 మరణాలు

ABN , First Publish Date - 2020-08-01T19:06:09+05:30 IST

కరోనా వైరస్‌ జూలైలో మరింత విజృంభించింది. నాలుగు వారాల్లో 14,864 మంది వైరస్‌ బారిన పడ్డారు. మొదటి మూడు వారాల్లో పోలిస్తే నాలుగో వారంలో కేసులు విపరీతంగా పెరిగాయి.

ఒక నెల.. 14,864 కేసులు.. 129 మరణాలు

జూలైలో కరోనా వైరస్‌ మరింత ఉధృతి

మొదటి వారంలో 767, రెండో వారంలో 2066 కేసులు

మూడో వారంలో 4799, నాలుగో వారంలో 7232

జూలై నెలలో కొవిడ్‌ మరణాల సంఖ్య 129


కర్నూలు(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ జూలైలో మరింత విజృంభించింది. నాలుగు వారాల్లో 14,864 మంది వైరస్‌ బారిన పడ్డారు. మొదటి మూడు వారాల్లో పోలిస్తే నాలుగో వారంలో కేసులు విపరీతంగా పెరిగాయి. జూలై 1 నుంచి 8 వరకు (మొదటి వారం) 767 మంది, 9 నుంచి 16వ తేదీ వరకు (రెండో వారం) 2066 కేసులు, 17 నుంచి 24 వరకు (మూడోవారం) 4799, 25 నుంచి 31వ తేదీ వరకు (నాలుగో వారం) 7232 కేసులు వచ్చాయి. మొదటి వారంతో పోలిస్తే చివరి వారంలో కేసులు సుమారు 9 రెట్లు పెరిగాయి. జిల్లాలో తొలి కరోనా వైరస్‌ కేసు మార్చి 28న నమోదు కాగా ఇప్పటి వరకు 16,847 మంది వైరస్‌ బారిన పడ్డారు. జూలై నెలలోనే 14,864 మంది వైరస్‌ బారిన పడ్డారంటే కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కరోనా ప్రబలిన నాటి నుంచి మే నెలాఖరు వరకు 1955 కేసులు రాగా.. జూన్‌ నెలలో 1313 మంది వైరస్‌ బారినపడ్డారు. జూలై నెలలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఇటీవల రోజూ వెయ్యి పైగా కేసులు నమోదవుతున్నాయి. జూన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత సడలించడంతో కరోనా వైరస్‌ ప్రతాపం చూపింది.


జూలైలో అదుపు తప్పింది

జూలై నెలలో కరోనా వైరస్‌ అదుపు తప్పింది. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో అత్యధికంగా కేసులు వచ్చాయి. బనగానపల్లె, కోడుమూరు, పాణ్యం, వెల్దుర్తి, అవుకు, బండిఆత్మకూరు, కర్నూలు రూరల్‌, ఆలూరుల్లో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒకటో తేదీన మొదలైన వైరస్‌ విజృంభణ నాలుగో వారంలో పీక్‌ స్టేజ్‌కు వెళ్లింది. జూలై చివరి వారంలో రికార్డు స్థాయిలో 7,232 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


కొవిడ్‌ మరణ మృదంగం

జిల్లాలో కొవిడ్‌ మరణాలు పెరుగుతున్నాయి. పాజిటివ్‌గా తేలకుండానే అనారోగ్యానికి గురై పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 195 మంది కొవిడ్‌తో మరణించగా, వీటిలో జూలై నెలలోనే 129 మంది ఉన్నారు. అత్యధిక మరణాలు కర్నూలు జీజీహెచ్‌ స్టేట్‌ కొవిడ్‌ ఆసుపత్రిలోనే సంభవించాయి.

Updated Date - 2020-08-01T19:06:09+05:30 IST