రైతులకు అందని పంట నష్ట పరిహారం

ABN , First Publish Date - 2020-12-28T05:36:39+05:30 IST

గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన జిల్లా రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేస్తోంది.

రైతులకు అందని పంట నష్ట పరిహారం
ఆత్మకూరులో నీట మునిగిన పంట(ఫైల్‌)

  1. జాబితాలో పలువురు రైతులకు దక్కని చోటు
  2. రూ.లక్షల్లో నష్టపోతే రూ.వందల్లో పరిహారం
  3. వర్షాధార పంటకు నీటి వసతి ఉన్నట్లు నమోదు
  4. పొరపాటు రైతులదే అంటున్న అధికారులు


కర్నూలు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోయిన జిల్లా రైతులకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేస్తోంది. వర్షాధా రంగా పండే వేరుశనగ, టమోట, పత్తి వంటి పంటలను నోటిఫై చేసి పరిహారం ఇస్తోంది. కానీ చాలామంది రైతులు నష్టపోయినా పరిహారం అందడం లేదు. మరికొందరు రూ.లక్షల్లో నష్టపోతే రూ.వందల్లో పరిహారం అందింది. దీంతో బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ-క్రాప్‌ నమోదు చేయించి, ప్రీమియం చెల్లించినా పరిహారం రాలేదని వాపోతున్నారు. జాబితా తయారీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందుకు పరిహారం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


నమోదులో ఇబ్బందులు

పంట నష్టం 33 శాతం మించితేనే పరిహారం అందించాలన్న నిబంధన కారణంగా చాలామంది రైతులు నష్టపోతున్నారు. దీనికి తోడు బీమా పరిహారం అందాలంటే ఈ-క్రాప్‌లో కచ్చితంగా నమోదై ఉండాలి. చాలామంది రైతులు ఈ-క్రాప్‌లో నమోదు చేయించలేదు. దీంతో పరిహారం అందకుండా పోతోంది. సర్వర్‌ సమస్య కారణంగా చాలా మంది రైతులు నమోదు చేయించలేకపోయారు. దీనికి తోడు సిబ్బంది కొరత కారణంగా నమోదు సక్రమంగా జరగలేదన్న అరోపణలు ఉన్నాయి. మరోవైపు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేటపుడు ఒక పంట, క్షేత్రస్థాయిలో మరోపంట నమోదు చేయడంతో పరిహారం విషయంలో ఇబ్బందులు తలెత్తాయని రైతులు అంటున్నారు. 


అంచనాలో నిర్లక్ష్యం

పంట నష్టం అంచనాలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పొలాల వద్దకు వెళ్లి రైతుల సమక్షంలో నష్టాన్ని పరిశీలించాలి. కానీ అధికారులు అరొకరగా సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించారు. కొంతమంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించకుం డానే నివేదికలు పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అర్హులకు పరిహారం అందకుండా పోతోంది. పైగా బీమా చెల్లించేందుకు పంట కోత ప్రయోగాలను ప్రామాణికంగా తీసుకుంటుడంతో చాలామంది రైతులకు జాబితాలో చోటు దక్కడం లేదు. ఈ ఏడాది ప్రయోగాల్లో ఒక హెక్టారుకు 450 కిలోల కంటే తక్కువ దిగుబడి వస్తేనే ఆ మండలాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రయోగం చేసిన పొలాల్లో అంచనా కంటే ఎక్కువ దిగుబడి వస్తే, దాన్నే అన్ని పొలాలకు వర్తింపజేస్తున్నారు. ఫలితంగా పంట నష్టపోయిన రైతులకు అన్యాయం జరుగుతోంది. 


జాబితా అస్తవ్యస్తం

2019 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1,13,830 మంది రైతులు పంట నష్టపోయినట్లు జాబితా తయారు చేశారు. వీరికి రూ.129.21 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. పక్క జిల్లాలతో పోల్చుకుంటే ఈ మొత్తం చాలా తక్కువ. కడప జిల్లాలో 1,18,291 మంది రైతులకు రూ.364 కోట్ల పరిహారం అందింది. అనంతపురం జిల్లాలో 4.51 లక్షల మందికి రూ.326 కోట్లు మంజూరు చేశారు. కానీ కర్నూలు జిల్లాలో రైతుల సంఖ్య, పరిహారం మొత్తం రెండూ తక్కువగానే ఉన్నాయి. ఈ-క్రాప్‌ నమోదు, పంట నష్టం అంచనా వేసే సమయంలో దొర్లిన తప్పల కారణంగా ఇలా జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒక్క రైతుకూ బీమా అందలేదు. మరికొన్ని మండలాల్లో బీమా పరిహారం అందుకున్న రైతుల సంఖ్య పదికి మించలేదు. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని ప్రశ్నిస్తే, ‘మీరిచ్చిన సమాచారంలో ఏవో పొరపాట్లు దొర్లి ఉంటాయి..’ అని అధికారులు తమనే తప్పుబడుతున్నారని  రైతులు అంటున్నారు. 


అర్హులందరికీ అందించాం..

పంట నష్టపోయిన రైతులకు అర్హతను బట్టి పరిహారం అందజేశాం. కొంతమందికి రాలేదంటే వారికి అర్హత ఉండదు. ఆదాయ పన్ను కట్టేవారు, పెన్షన్‌ తీసుకునే వారికి పరిహారం అందదు. మరికొందరు సరైన సమాచారం ఇవ్వని కారణంగా జాబితాలో చోటు దక్కలేదు. పంటల బీమా విషయంలో సాధ్యమైనంత మందికి మేలు చేకూరేలా నివేదికలు పంపాం. రైతుకు అన్యాయం జరగనివ్వలేదు. - ఉమామహేశ్వరమ్మ, జేడీఏ, కర్నూలు.


తప్పంతా మాదేనంటున్నారు

నాకు ఐదెకరాల పాలం ఉంది. పోయిన సంవత్సరం పత్తి వేశాను. పెట్టుబడి మొత్తం పోయింది. దాదాపు రూ.60 వేల వరకు నష్టం జరిగింది. బీమా ప్రీమియం చెల్లించాను. అన్ని అర్హతలున్నా జాబితాలో పేరు లేదు. ఇదేమిటని అడిగితే పంటల బీమా నమోదు  సమయంలో వర్షాధార భూమి అని కాకుండా, నీటి వసతి ఉన్న భూమిగా నమోదైందని అంటున్నారు. అధికారులు చేసిన తప్పులకు మా లాంటి రైతులు ఎంతోమంది బలి అవుతున్నారు. ప్రభుత్వం రైతుకు ప్రత్యేకంగా ఏమి చేయడం లేదు. కనీసం బీమా కంపెనీలు ఇచ్చే నష్ట పరిహారాన్ని కూడా సరిగా అందనీకపోతే ఎలా..? - లక్ష్మీనారాయణరెడ్డి, కోతిరాళ్ళ, పత్తికొండ.


బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా..

నాకు పదెకరాల పొలం ఉంది. ఇందులో వేరుశనగ వేశాను. పంట మొత్తం నాశనం అయింది. రూ.లక్షకు పైగా నష్టం వచ్చింది. బీమా డబ్బులు రాలేదు. అసలు వస్తాయో లేదో తెలియడం లేదు. మా గ్రామంలో రెండు వందల మందికి పైగా రైతులు ఉన్నారు. కేవలం 20 మందికి పంటల బీమా పరిహారం వచ్చింది. - జయరాముడు, రామదుర్గం, డోన్‌


నాలుగు లక్షలు నష్టపోయినా..

నాకు 15 ఎకరాల పొలం ఉంది. అందులో పత్తి వేశాను. రూ.4 లక్షల వరకు పంట నష్టం వచ్చింది. ఒక్క రూపాయి కూడా బీమా పరిహారం రాలేదు. వర్షాధారంగా పంట వేస్తే.. నీటి వసతి ఉన్న భూమి అని చూపించారు. అధికారులు చేసిన తప్పిదానికి మాలాంటి రైతులు నష్టపోతున్నారు. మా గ్రామంలో రైతులందరిదీ ఇదే పరిస్థితి. - బసిరెడ్డి, పెండెకల్లు, తుగ్గలి.

Updated Date - 2020-12-28T05:36:39+05:30 IST