-
-
Home » Andhra Pradesh » Kurnool » Collector G Veerapandian
-
నియోజకవర్గాల్లో క్వారంటైన్ సెంటర్లు
ABN , First Publish Date - 2020-03-25T10:34:17+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అన్ని సౌకర్యాలతో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి. వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు.

14 చోట్ల 1600 పడకలతో ఏర్పాటు
మౌలిక వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
వెంటనే అందుబాటులోకి వచ్చేలా ఆదేశాలు
కర్నూలు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అన్ని సౌకర్యాలతో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ జి. వీరపాండియన్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం అన్ని నియోజకవర్గాల్లో 1600 పడకలతో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాట్లపై అన్ని శాఖల ఇంజనీర్లు, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహించారు. క్వారంటైన్ సెంటర్లలో ముందుగా రూమ్‌లలో తలుపులు, కిటికీలు తదితర వాటిని శుభ్రం చేయడంతో పాటు చుట్లు పక్కల కూడా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం క్వారంటైన్ సెంటర్లలో 89 అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సామాజిక దూరం పాటించేలా సూచనలు ఇవ్వాలన్నారు. అదే విధంగా ఆ సెంటర్లలో ఉండే వారు కచ్చితంగా 24 గంటలు విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రధానంగా తాగునీరు, కరెంట్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కచ్చితంగా ఉండేలా క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తతో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి వారిని సకాలంలో హోమ్ ఐసొలేషన్‌కు తరలించాలన్నారు. విధులలో అలసత్వం ప్రదర్శించకూడదని, మెడికల్ ఆఫీసర్లు ఎప్పటికపుడు స్పందించి వెంటనే సమాచారం అందించాలన్నారు. క్వారంటైన్ సెంటర్లలో కాటన్, బెడ్ షీట్స్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. క్వారంటైన్ రూమ్‌లకు దగ్గరలోనే వ్యర్థాలను పారవేయడం కోసం తగిన ప్రదేశాన్ని ఎంచుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా క్వారంటైన్ సెంటర్లు కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గంలో కేటాయించిన ప్రదేశాలు, రాయలసీమ విశ్వవిద్యాలయం, డోన్ నియోజకవర్గంలో ఏపీ మోడల్ స్కూలు, సి. బెళగల్, ఆత్మకూరు నియోజకవర్గాలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నంద్యాల నియోజకవర్గంలో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గురుకుల విద్యాలయం సింగపూర్ టౌన్‌షి్‌ప, బనగానపల్లి నియోజకవర్గంలో ఏపీ మోడల్ స్కూల్ రవ్వలకొండ, పాణ్యం నియోజకవర్గంలో ఏపీ మోడల్ స్కూల్ గర్ల్స్ సుగాలి మిట్ట, ఆదోని నియోజకవర్గంలో మిల్టన్ హైటెక్ స్కూల్, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జవహర్ నవోదయ స్కూల్, పత్తికొండ నియోజకవర్గంలో ఏపీ మోడల్ స్కూల్ గుత్తి రోడ్డు, ఆలూరు నియోజకవర్గంలో కేజీబీవీ స్కూల్ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు సంబంధించిన మౌలిక వసతులపై జిల్లా కలెక్టర్ మెడికల్ నోడల్ ఆఫీసర్లు, తహసిల్దార్లతో వీడియో కాన్ఫిరెన్స్‌లో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్-2 ఖాజా మోహీద్దీన్, డీఆర్‌వో పుల్లయ్య, డీఎంహెచ్‌వో రామ గిడ్డయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.