రైతులను మోసం చేస్తున్న సీఎం

ABN , First Publish Date - 2020-12-11T05:37:51+05:30 IST

రైతులను నమ్మించి సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ఆరోపించారు.

రైతులను మోసం చేస్తున్న సీఎం
మాట్లాడుతున్న అఖిలప్రియ

  1.  ఇసుక అందుబాటులో లేక ఉపాధి కోల్పోతున్న కార్మికులు  
  2. మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అఖిలప్రియ


ఆళ్లగడ్డ, డిసెంబరు 10: రైతులను నమ్మించి సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ఆరోపించారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తా అన్న వైఎస్‌ జగన్‌ అన్నదాతను మోసం చేస్తున్నారని విమర్శించారు. తుఫాను వల్ల రైతు సాగు చేసిన పంటలు నేలపాలైనా పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదని అన్నారు. వరి, మినుము, అరటి, శనగ పంటలు 43 వేల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్నాయని, వీటికి ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న పంటల గురించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావనకు కూడా ప్రభుత్వం తీసుకరాలేదని అన్నారు. ఈ క్రాప్‌ కాని పంటలకు నష్టపరిహారం చెల్లించమని ప్రభుత్వం అంటోందని, అదే జరిగితే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని అన్నారు. గ్రామాల్లో రూ. 2 వేల కోట్లతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాల్లో పంట నష్టం గురించిన వివరాలు లేవని అన్నారు. అలాంటప్పుడు భరోసా కేంద్రాలేందుకని ఆమె ప్రశ్నించారు. వరి పంటకు రూ. 2 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, రంగు మారిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగొలు చేయాలని, నంద్యాల, కర్నూలు సోనా దిగుబడులను ఎక్స్‌పోర్టుకు అనుమతించాలని ఆమె డిమాండు చేశారు. అలాగే రబీ పంటలకు పెట్టుబడి సాయం చేయాలని, ఏప్రిల్‌ ఆఖరు వరకు సాగు నీరు అందించాలని డిమాండు చేశారు. ఇసుక అందుబాటులో లేక పోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, పట్టణంలోని ఇసుక డంప్‌లో అక్రమ రవాణా జరిగిందని విజిలెన్స్‌ కమిటీ ు రూ.70 లక్షలు జరిమానా విధించారని చెప్పారు. దీంతో ఇసుకను కర్నూలు, నంద్యాల వంటి పట్టణాల్లో బుక్‌ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది పేదల రేషన్‌ కార్డులు తొలగించారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పండ్ల తోటల పెంపకానికి, డ్రిప్‌ ఇరిగేషన్‌ 90 శాతం సబ్సిడీతో నిధులు మంజూరు చేశారని గుర్తు చేస్తూనే వైసీపీ ప్రభుత్వం పైసా ఇవ్వలేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డిపల్లె శేఖర్‌రెడ్డి, మర్రిపల్లె పాపిరెడ్డి, చాగలమర్రి టీడీపీ నాయకులు రఘునాథరెడ్డి, నరసింహారెడ్డి, అన్సర్‌బాషా, చల్లా నాగరాజు పాల్గొన్నారు.


16న శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు

మాజీ ఎమ్మెల్యే దివంగత భూమా శోభానాగిరెడ్డి జయంతి వేడుకలను ఈ నెల 16వ తేదిన శోభా ఘాట్‌లో నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఈ వేడుకలకు అన్ని పార్టీల నాయకులను, విద్యార్థి సంఘాలను ఆహ్వానిస్తామని అన్నారు. 


సంజీవరాయస్వామికి పూజలు 

చాగలమర్రి: మండలంలోని వెల్లాల క్షేత్రంలో సంజీవరాయ స్వామి ఆలయాన్ని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గురువారం సందర్శించారు. కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి ఆలయానికి చేరుకోగానే వేద పండితులు స్వాగతం పలికారు. ఆమె వెంట మాజీ ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ అన్సర్‌బాషా, టీడీపీ ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఖాదర్‌బాషా తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-11T05:37:51+05:30 IST