వైసీపీ నాయకుల ఘర్షణ
ABN , First Publish Date - 2020-02-24T10:44:47+05:30 IST
మండల పరిధిలోని చెన్నంపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు ఆదివారం ఘర్షణకు దిగాయి.
ముగ్గురికి గాయాలు
చెన్నంపల్లెలో అధికార పార్టీ వర్గపోరు
అవుకు, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని చెన్నంపల్లెలో వైసీపీలోని రెండు వర్గాలు ఆదివారం ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికి చెందిన వెంకట శివారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, మరో వర్గానికి చెందిన శివనాథరెడ్డి గాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆధిపత్యం కోసం అధికారపార్టీలోని రెండు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాలవారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎదురుపడి ఘర్షణకు దిగారు. ఒక వర్గానికి చెన్నపంల్లె కాగా, మరొక వర్గానికి చెందిన సుబ్బారెడ్డి, శివనాథరెడ్డి, శివశంకర్‌రెడ్డిది మర్రికుంట తండా. 20 సంవత్సరాల క్రితం వీరు చెన్నంపల్లెకి వచ్చి స్థిరపడ్డారు. ఇరువర్గాలు ఘర్షణ కారణంగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. సీసీ పుటేజీని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
చెన్నంపల్లెలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఒక వర్గానికి చెందిన సుబ్బారెడ్డి, శివనాథరెడ్డి, శివశంకర్‌రెడ్డి, హరినాథరెడ్డి, ఉదయకుమార్‌రెడ్డి, మరో వర్గానికి చెందిన వెంకటశివారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, సాంబశివారెడ్డి, సూర్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గ్రామాలలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.