680 మందిపై కేసులు
ABN , First Publish Date - 2020-03-27T10:19:06+05:30 IST
ఇంటికి పరిమితం కాకుండా, నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చిన 680 మందిపై కేసులు నమోదు చేశామని కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు.
338 వాహనాలు సీజ్
లాక్‌డౌన్ ఉల్లంఘనలపై కొరడా
కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరిక
రైతు బజార్ల వికేంద్రీకరణ
సరుకుల డోర్ డెలివరీకి ఏర్పాట్లు
కర్నూలు (ఆంధ్రజ్యోతి), మార్చి 26: ఇంటికి పరిమితం కాకుండా, నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చిన 680 మందిపై కేసులు నమోదు చేశామని కలెక్టర్ వీర పాండియన్ వెల్లడించారు. నిబంధనలు పాటించనివారికి మరింత కఠినమైన శిక్షలు ఉంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. ఎస్పీ ఫక్కీరప్పతో కలిసి గురువారం లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కజిల్లాలోకి ఎవరినీ రానీవ్వబోమని స్పష్టం చేశారు. రాకపోకలను అడ్డుకునేందుకు ఏడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు.
నగరంలో ఉండిపోయిన ఇతర ప్రాంతాలవారు సహాయం కోసం 1902 నెంబరుకు ఫోన్ చేయాలని, వారికి అవసరమైన భోజనం సమకూరుస్తామని తెలిపారు. కనీస అవసరాలు, నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన 680 వారిపై 202 కేసులు నమోదు చేశామని, 338 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు.
నిత్యావసరాల కోసం..
రద్దీ తగ్గించేందుకు, సామాజిక దూరాన్ని పాటించేందుకు రైతు బజార్లను వికేంద్రీకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేశామని కలెక్టర్ అన్నారు. వదంతులు నమ్మవద్దని, ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు అమ్మితే కేసు నమోదు చేసి, దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కర్నూలు నగరంలోని రిలయన్స్, డీమార్ట్, బిగ్ బజార్, వాల్‌మార్ట్, జ్యోతిమాల్, స్పెన్సర్ తదితర సూపర్ మార్కెట్ల యజమానులతో మాట్లాడి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు నిత్యావసర వస్తువులు డోర్ డెలీవరి చేసేలా ఏర్పాటు చేశామని తెలిపారు.
ధైర్యంగా ఎదుర్కొందాం..
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని, ప్రజలు ధైర్యంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విధులలో ఉన్న వలంటీర్లు, సిబ్బంది, అధికారులు కోవిడ్-19 సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు నగరాన్ని క్రిమిరహిత నగరంగా తీర్చి దిద్దడానికి చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా నగరంలో సోడియం హైడ్రో క్లోరైడ్‌ను స్ర్పే చేయించామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో కూడా శానిటేషన్ బాగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
కరోనా మెడికల్ సహాయంలో ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కాల్ సెంటర్ నెంబర్ 9441300005, లేదా హెల్ప్‌లైన్ 104, 1902కు ఫోన్ చేయాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, చేతులను సబ్బుతో, శానిటైజర్‌తో తరుచూ శుభ్రం చేసుకోవాలని కోరారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎస్పీతో కలిసి కర్నూలు, నంద్యాలలో లాక్‌డౌన్‌ను పరిశీలించామని తెలిపారు.