అడ్డూ అదుపూ లేకుండా పోయిన వడ్డీ వ్యాపారుల అరాచకాలు.. ఎంత వసూలు చేస్తున్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2020-12-13T06:09:19+05:30 IST
కర్నూలు నగరంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

కర్నూలులో కాల్ ‘కేయులు’
వడ్డీ వ్యాపారుల అరాచకాలు
వందకు 10 నుంచి 20 రూపాయల చొప్పున..
ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లతో వసూళ్లు
బలవంతంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు
డెబిట్ కార్డులు లాక్కుని డబ్బులు డ్రా
కర్నూలు, ఆంధ్రజ్యోతి: కర్నూలు నగరంలో వడ్డీ వ్యాపారుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. వందకు నెలకు రూ.10-20 చొప్పున వసూళ్లు చేస్తున్నారు. వడ్డీకి వడ్డీ లెక్కగట్టి పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులైతే డెబిట్ కార్డులు లాక్కుంటున్నారు. ఒకటో తేదీ వచ్చేసరికి ప్రభుత్వ వైద్యశాల, ఆర్‌అండ్‌బీ తదితర ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాచుకు కూర్చుంటు న్నారు. ఉద్యోగులకు జీతం అలా పడగానే ఇలా వాలిపోతున్నారు. కొంతమంది బాధితుల ఇళ్లకే వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. శనివారం నగరంలో ఓ ఆర్‌అండ్‌బీ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్లే తాము పురుగుల మందు తాగామని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పు తాయిలాలు.. వడ్డీ గేలాలు
ప్రభుత్వ శాఖల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులను వడ్డీ వ్యాపారులు ఎంచుకుంటున్నారు. రూ.లక్షలు అప్పుగా ఇచ్చి ఆరంభంలో వడ్డీ రూ.2 అని నమ్మిస్తున్నారు. ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన ఖాళీ ప్రామిసరీ నోట్లను తీసుకుంటున్నారు. కొన్ని నెలల తర్వాత వడ్డీని అనూహ్యంగా రూ.10, రూ.20 దాకా పెంచేసి దోపిడీ చేస్తున్నారు. ఇలాంటివి నగరంలో తరచూ జరుగుతూనే ఉన్నా.. చాలావరకు వెలుగులోకి రాకముందే పంచాయితీల రూపంలో సమసిపోతున్నాయి. కల్లూరులోని ఓ ఉద్యోగి అవసరార్థం రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. వడ్డీపై వడ్డీ చెల్లించలేని ఆ ఉద్యోగి చివరకు తన రూ.25 లక్షల విలువైన ఇంటిని ఆ వడ్డీ వ్యాపారికే ఇచ్చేశాడు. ఇది స్థానికంగా పలుకుబడి ఉన్న ఓ నాయకుడి ఇలాఖాలో పంచాయితీ చేసి సెటిల్ చేశారు. ఇవి సివిల్ కేసులతో ముడి పడుండటంతో పోలీసులు కూడా పట్టించుకోలేరు. కోర్టుల ద్వారా తేల్చుకోవాల్సిన వీటిని.. కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులే సెటిల్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో..
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కొందరు ద్వితీయ, తృతీయ శ్రేణి ఉద్యోగులు కాంట్రాక్టర్లు, నాలుగో శ్రేణి ఉద్యోగులను ఆకర్షిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. కొందరు స్టాఫ్ నర్సులు, మినిస్టీరియల్ ఉద్యోగులు రూ.2 నుంచి రూ.5 వరకు వడ్డీతో అప్పు తీసుకుంటున్నారు. జనరల్ ఆసుపత్రిలో ఓ థర్డ్ గ్రేడ్ ఉద్యోగి, మెడికల్ కాలేజీలోని మరో థర్డ్ గ్రేడ్ ఉద్యోగితో పాటు కొందరు హెడ్ నర్సులు అక్కడ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బాధితుల్లో 400 మంది కేఎంసీ ఉద్యోగులు
వడ్డీ వ్యాపారంలో కేఎంసీ కూడా మినహాయింపేమీ కాదు. దాదాపు 400 మంది కార్మికులు, ఉద్యోగులు ఈ వడ్డీ వ్యాపారం ఊబిలో చిక్కుకుపోయారు. రూ.10-20 వడ్డీ చెల్లించలేక సతమతమవుతున్నారు. కేఎంసీ కాంపౌండ్‌లోనే ఈ వడ్డీ వ్యాపారులు తిష్ట వేసుకుని ఉంటారు. బాధితుల నుంచి చెక్కులు, బాండ్లతో పాటు ఏటీఎం కార్డులను కూడా ముందే తీసుకుంటున్నారు. జీతాలు పడటమే ఆలస్యం వాళ్లకు రావాల్సిన వడ్డీ డబ్బులు తీసుకుని మిగతా జీతాన్ని సిబ్బందికి ఇస్తున్నారు. ఈ వ్యవహారం ఏళ్ల తరబడి సాగుతున్నట్లు సమాచారం. పారిశుధ్య, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ ఇలా అన్ని విభాగాల్లోనూ వందలాది మంది ఉద్యోగులు ఈ వడ్డీ రక్కసి కోరల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది.