ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే..: భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-02-08T11:16:55+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌..

ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే..: భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

కర్నూలు(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ వికృత చేష్టలతో రాష్ట్రం అంధకారమవుతోందని, కేంద్రం జోక్యం చేసుకొని రాష్ట్రాన్ని రక్షించాలని మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక స్టాంటన్‌పురంలోని కన్వెన్షన్‌ హాల్‌లో పాణ్యం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అభివృద్ధి పరవళ్లు తొక్కుతుందని, మల్టినేషనల్‌ కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఇందుకు భిన్నంగా  ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఉందన్నారు.


ఇటీవల దావోస్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుదారులను ఆకర్షించిన తీరు అద్భుతంగా ఉందన్నారు. అయితే ఏపీలో ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ బీహార్‌ రాష్ట్రాన్ని తలపిస్తోందన్నారు. జగన్‌ మోహన్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు వల్ల పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా లేరన్నారు. కియా మోటారు కంపెనీ కూడా వెనకకు పోతుందని పార్లమెంట్‌లో చర్చ జరుగుతుందంటే ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతుందన్నారు.


ఏడు నెలల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో? ఎన్ని వెనుకకు వెళ్లాయో? లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ దృష్టి పాలనమీద లేదని,  ప్రజలు తిరగబడే రోజులు త్వరలో ఉన్నాయన్నారు. రాష్ట్రానికి దేశంలో గొప్ప చరిత్రతో పాటు వనరులు ఉన్నాయని, వాటిని జగన్‌ వినియోగించుకునే స్థితిలో లేరన్నారు. అనవసర పథకాలకు రాష్ట్ర ఖజానాను  ఖర్చుచేస్తూ ఆర్థిక భారాన్ని మోపుతున్నారన్నారు. ఈ భారం నుంచి రాష్ట్రం బయట పడాలన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఎవరు అడిగారన్నారన్నారు.


370 ఆర్టికల్‌ రద్దుకు ముందు కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఇష్టపడేవారుకాదని అయితే ఇప్పుడు అక్కడ కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారన్నారు. నంద్యాల నియోజకవర్గం ఇన్‌చార్జి నీలకంఠం మాట్లాడుతూ 11న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు ధీన్‌దయాల్‌ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు విరాళాలను అందజేస్తారన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీఎస్‌ నాగరాజు, మహిళా నాయకులు గీతామాధురి, చింతలపల్లి రామకృష్ణ, వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-08T11:16:55+05:30 IST