రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-03-16T11:12:44+05:30 IST

రద్దు చేయాలి

రద్దు చేయాలి

వాయిదాతో భయాందోళనలు తొలగవంటున్న ప్రజలు

బ్యాలెట్‌ పేపర్లు వాడే ఎన్నికల్లో జనం రద్దీ ఎక్కువ 

 వైరస్‌ వ్యాపిస్తుందని  ఎన్నికల కమిషన్‌ అనుమానం

ఆరు వారాల తర్వాత ఎన్నికలపై సమీక్ష.. తదుపరి నిర్ణయం

ఫలించిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నాలు 


కర్నూలు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పది రోజుల క్రితం  ఇటలీలో 15 మందికి కూడా సోకని   కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ బాధితుల సంఖ్య నేడు 15వేల కేసులకు చేరింది. ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించి,   సాధారణ స్థితికి తేవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. అందులో భాగంగానే ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ఆదివారం ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర పడ్డా.. వాయిదా కాకుండా రద్దు చేయాలని   ప్రజలు, రాజకీయ పక్ష నాయకులు(కొంత మంది మినహా) డిమాండ్‌ చేస్తున్నారు.  ఈ క్రమంలో కరోనా వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో విజృంభిస్తుందో వివరిస్తూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎప్పటికప్పుడు  అప్రమత్తం చేస్తూ వచ్చారు. కాగా ఎన్నికల కమిషనర్‌కు ఆయన శనివారం   ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని ఆయన అభినందించారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించినా.. ఆరు వారాల తర్వాత సమీక్ష నిర్వహించాకే ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం కొసమెరుపు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను రద్దు చేస్తేనే మంచిదన్న వాదనలు అన్ని వర్గాల్లోనూ బలపడుతోంది  


జనవరి నుంచి మొదలైన కరోనా ప్రభావం మూడు నెలలు గడిచినా తగ్గకపోగా పెరిగిందనే చెప్పాలి.   కర్నూల్లోనే నాలుగు అనుమానిత కేసులు నమోదవ్వగా జిల్లాకు దగ్గర ప్రాంతాలైన హైదరాబాద్‌, నెల్లూరులోనూ ఇప్పటికే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితులకు ఆ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం   తక్కువేనని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కానీ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వల్ల  కొంత సమస్య  తలెత్తే అవకాశం ఉందని,  ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టామని వైద్యులు అంటున్నారు.  ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయడం మంచి నిర్ణయమేనని వైద్యులు కూడా భావిస్తున్నారు.   ఎన్నికల్లోని వివిధ దశల్లో    ఒక్కో జిల్లాలో  లక్షలాది మంది పాల్గొంటారు.  ఈవీఎం లేదా బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగే  ఎన్నికల్లో  గుంపులుగా పాల్గొనే  పరిస్థితి ఉంటుంది. అందువల్ల  ఈ వైరస్‌ వ్యాప్తి చెందడానికి మరింత అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  రాజకీయ పక్షాలు కూడా అధికార పార్టీ తీరును తప్పు పడుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వల్ల  సంక్షేమ పథకాలు అమలు, ఇళ్ల స్థలాల పంపిణీని నిలిపేసిందంటూ ఎన్నికల సంఘంపై మండిపడటాన్ని సీఎం పరిణతి స్థాయికి పరాకాష్టగా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఆహ్వానించాల్సి పోయి వ్యతిరేకించడం సబబు కాదని హితవు చెబుతున్నారు. 

Updated Date - 2020-03-16T11:12:44+05:30 IST