కరోనా కట్టడిలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-07-18T10:52:04+05:30 IST

కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

కరోనా కట్టడిలో నిర్లక్ష్యం

మాజీ ఎమ్మెల్యే బీసీ


బనగానపల్ల్లె, జూలై 17: కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. కరోనా పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం వల్ల రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయన్నారు. క్వారంటైన్‌ లేకపోవడం, టెస్టింగ్‌ కిట్ల కొరత వల్ల ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం లేదన్నారు. అయితే ఈ సమస్యలు ప్రజలకు తెలియకుండా అధికారులు దాచిపెడుతున్నారన్నారు. కేసులు పెరగడంతో లాక్‌డౌన్‌ పెంచామని, ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిఽధుల నిర్లక్ష్యం కంటి ముందు కనిపిస్తోందన్నారు.


ఎక్కడా శానిటైజేషన్‌  కూడా చేయడం లేదన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కాటసాని కూడా అధికారులతో రివ్యూ మీటింగ్‌లు పెట్టడం లేదన్నారు. ప్రజలకు చెప్పాల్సిన నాయకుడే  గుంపులుగా తిరుగుతూ భౌతిక దూరం పాటించకుంటే ఎలా అని బీసీ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రతి గ్రామంలో శానిటైజేషన్‌ చేసి కరోనా ఉధృతిని అరికట్టాలని కోరారు. శాంతిరాం ఆస్పత్రిలో గత నాలుగు రోజుల నుంచి నీటి వసతి లేక డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్ల కరోనా బాధితులు అవస్థలు పడుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కరోనా బాధితుల పట్ల ప్రజలు దయ చూపాలని, వివక్ష వీడాలని కోరారు.

Updated Date - 2020-07-18T10:52:04+05:30 IST