-
-
Home » Andhra Pradesh » Kurnool » Bananas in the soil
-
మట్టిలోకి అరటి
ABN , First Publish Date - 2020-12-30T05:55:19+05:30 IST
అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనేవారు లేక పటను దున్నేస్తున్నారు.

- కొనేవారు లేక దున్నేసిన రైతులు
- ఆలూరులో రూ.4.50 కోట్లు నష్టం
- ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూపు
రుద్రవరం, డిసెంబరు 29: అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనేవారు లేక పటను దున్నేస్తున్నారు. రుద్రవరం మండలం ఆలమూరు రైతులు సుమారు 450 ఎకరాల్లో అరటి సాగు చేశారు. వరదల సమయంలో భారీగా నష్టపోయారు. ఆ విపత్తును తట్టుకుని నిలబడ్డ పంటకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదు. దిగుబడులు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సుమారు 200 ఎకరాల్లో అరటి తోటలు సోమవారం రైతులు దున్నేశారు. మరో 250 ఎకరాలు దున్నేసేందుకు సిద్ధమవుతున్నారు. పంటను అలాగే ఉంచితే కొనేవారు లేక, మరో పంట సాగు చేసే వీలు లేక మరింత నష్టపోతామని రైతులు కంటతడి పెడుతున్నారు. సుమారు రూ.4.50 కోట్ల నష్టం జరిగిందని రైతులు తెలిపారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
అరటి రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రూ.లక్షలు అప్పు చేసి పంట సాగు చేశామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తే మినుము, మొక్క జొన్న పంటలు సాగు చేసుకుంటామని, జరిగిన నష్టాన్ని కొంతైనా పూడ్చుకునేందుకు ప్రయత్నం చేస్తామని అంటున్నారు.
రూ.పది లక్షలు నష్టపోయా..
ఇప్పటి వరకు నాలుగు ఎకరాల్లో అరటి పంటను తొలగించాను. ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు అయింది. ఈ ఏడాది సేద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి నష్టపోయాను. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
- గరుడయ్య, ఆలమూరు
రెండెకరాలు దున్నేశాను..
ఏ పంట వేసినా కలిసిరావడం లేదు. అరటి సాగు చేసి కష్టాలు గట్టెక్కుదామని ఆశించాను. చెమటోడ్చి పండిస్తే కొనేందుకు ఎవరూ రావడం లేదు. దీంతో ఇప్పటికే రెండెకరాల అరటి తోటను దున్నేశాను. రూ.2 లక్షల అప్పు మిగిలింది.
- గోవిందు, ఆలమూరు
నష్టాలు మిగిల్చిన అరటి..
అరటి సాగు కొంప ముంచింది. రెండు ఎకరాల్లో పంట సాగు చేస్తే కొనేవారు లేరు. దిక్కుతోచక ట్రాక్టర్‌తో దున్నెశాను. రూ.2 లక్షలు నష్టపోయాను. ఈ ఏడాది అరటి పంట మాకు తీవ్ర నష్టాలు మిగిల్చింది.
- ఇస్మాయిల్, ఆలమూరు
కొనేవారు రాక..
అరటి పంట చేతికి వచ్చింది. కానీ కొనేవారు లేక తీవ్రంగా నష్టపోయాం. రెండున్నర ఎకరాల్లో అరటి పంటను దున్నేశాను. ఇందులో మొక్కజొన్న, మినుము సాగు చేస్తున్నాను. వ్యవసాయం చేస్తే అప్పులు తప్ప ఏమీ మిగలడం లేదు.
- రామ్మోహన్, ఆలమూరు
ప్రభుత్వం ఆదుకోవాలి..
ఐదు ఎకరాల్లో అరటి తోటను దున్నేశాను. రూ.5 లక్షలకు పైగా పెట్టుబడి నష్టపోయాను. అప్పుల ఊబిలో కూరుకుని పోయాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
- పుల్లయ్య, ఆలమూరు
