-
-
Home » Andhra Pradesh » Kurnool » Banaganapally News
-
లోతట్టు ప్రాంతాల్లో నివసించేదెలా?
ABN , First Publish Date - 2020-12-07T05:09:55+05:30 IST
పట్టణంలో ఎస్సార్బీసీని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇస్తున్నారని, ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివసించాలని? బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు.

- ఎస్సార్బీసీ పక్కన స్థలాలు ఇచ్చారు
- గండి పడితే ఎమ్మెల్యే రామిరెడ్డి బాధ్యత వహిస్తారా?
- ప్రజలను తప్పదోవ పట్టించేందుకు మాపై ఆరోపణలు
- మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆగ్రహం
బనగానపల్ల్లె, డిసెంబరు 6: పట్టణంలో ఎస్సార్బీసీని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు ఇస్తున్నారని, ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివసించాలని? బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంటి పట్టాలు ఇస్తున్న ప్రాంతాల్లో బీసీ పర్యటించిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనగానపల్లె పట్టణంలోని ఇళ్ల పట్టాల పంపిణీని తాము అడ్డుకుంటున్నామని అసెంబ్లీలో సీఎం జగన్, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించడం తగదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పేదలకు స్థలాలివ్వడాన్ని అడ్డుకునే సంస్కృతి తమది కాదని అన్నారు. అవరమైతే పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాను సగం ఖర్చు భరిస్తానని, ఎమ్మెల్యే సగం ఖర్చు భరించాలని సవాల్ విసిరారు. గతంలో 2014, 2017 ప్రాంతాల్లో ఎస్సార్బీసీకి గండి పడి వెంకటాపురం, పట్టణంలోని పెండేకంటినగర్, జమ్మిరెడ్డి కాలనీ, ఆర్టీసీబస్టాండ్, పాతపెట్రోల్‌బంకు, ఈద్గానగర్, ప్రభుత్వ వైద్యశాల ప్రాంతాలు జలమలమయ్యాయన్నారు. రెండు రోజుల పాటు ఇళ్లల్లోకి ప్రవేశించి భయభ్రాంతులతో పట్టణ ప్రజలు జీవించారన్నారు. ఎస్సార్బీసీని ఆనుకొని పట్టాలు ఇస్తే భవిష్యత్తులో గండి పడితే పేద ప్రజల జీవితాలకు ఎమ్మెల్యే కాటసాని హామీ ఇస్తారా? అని ప్రశ్నించారు. 2020 మార్చి 4న చట్టానికి విరుద్ధంగా కలెక్టర్ ఇంటి పట్టాలకు ప్రొసీడింగ్ ఇచ్చారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయించామని అన్నారు. నీటి పరివాహక ప్రాంతాల దగ్గట్లో పట్టాలు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని అన్నారు. హైకోర్టులో స్టే తెస్తే ఎందుకు ఎమ్మెల్యే వెకేట్ చేయించలేదని బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీకి, ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. తన పీఏపై మహిళా కార్యకర్తలతో దాడి చేయించి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారన్నారు. బనగానపల్లె పట్టణంలో ప్రభుత్వ నిధులతో 3వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి కొనే స్థోమత లేదా? అని ప్రశ్నించారు. రైతులతో కొంటే కమీషన్ అడుగుతారని ప్రభుత్వం ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయించి పేద ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలన్నారు. ప్రస్తుతం ఇచ్చే ఇంటి పేదల ఇంటి పట్టాల పంపిణీలో సొంత ఆదాయం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, పేదలకు ఇవ్వాల్సిన పట్టాలను అనుచరులతో రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు అమ్మి కోట్లు గడించింది ఎవరో ప్రజలకు తెలుసు అని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నికలు సమీపించే సమయంలో కల్పిత పట్టాలను సృష్టించి 3,386 పట్టాలు పంపిణీ చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. ఆ పట్టాలు ఏమయ్యాయని బీసీ జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎస్సార్బీసీ, ఇరిగేషన్ క్యాడ్ అనుమతులు లేకుండా, వెంకటేశ్వరస్వామి ఆలయ భూములను దేవాదాయశాఖ అనుమతులు లేకుండా పట్టాలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది ఎవరో అందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పటికైనా ఆరోపణలు మాని పేదలకు పొలాలు కొని అనువైన చోట ఇంటి పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే బీసీ డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన్, బురానుద్దీన్, టిప్‌టాప్ కలాం, రాయలసీమ కలాం, మద్దిలేటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.