శిథిల భవనాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు

ABN , First Publish Date - 2020-03-02T11:06:13+05:30 IST

ఆదోని మండలం బైచిగేరిలోని ఆరోగ్య ఉప కేంద్ర భవనం ఇది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా ప్రారంభించలేదు. వైద్య శాఖ స్వాధీనం చేసుకోలేదు.

శిథిల భవనాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు

మందులు, సిబ్బంది కొరత

టీకాలు వేయడానికీ ఇబ్బందులు

వ్యాధులు సోకితే పట్టణాలకు వెళ్లాల్సిందే


ఆదోని మండలం బైచిగేరిలోని ఆరోగ్య ఉప కేంద్ర భవనం ఇది. రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా ప్రారంభించలేదు. వైద్య శాఖ స్వాధీనం చేసుకోలేదు. దీంతో గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల భవంతిని వైద్య సిబ్బంది ఉపయోగించుకునేవారు. రేషన్‌ దుకాణం కోసం డీలర్‌ బడిని స్వాధీనం చేసుకోవడంతో ఆ అవకాశం కూడా దూరమైంది. ఎక్కడ విధులు నిర్వహించాలో తెలియక ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. వ్యాధులు సోకితే రోగులకు వైద్యం అందించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ వైద్యం పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోంది. చాలాచోట్ల భవనాలు లేవు. మౌలిక వసతులు, ఔషధాల కొరత వేధిస్తోంది. దీంతో రోగులు ఆర్‌ఎంపీలను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జబ్బు తీవ్రమైతే పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది.


ఆదోని/ఎమ్మిగనూరు, మార్చి 1: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉపకేంద్రాలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. అద్దె భవనాలు, శిథిల భవనాల్లో కొన్ని కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు వెళ్లి వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో పాము, కుక్క, తేలు కాటు బాధితులు ఎక్కువగా ఉంటారు. వీరికి అత్యవసరమైన మందులు అందుబాటులో లేవు. దీంతో ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పట్టణాలకు వెళుతున్నారు. తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు లేక రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.  జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల దుస్థితిపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన కథనం.


ఆదోని డివిజన్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24, గ్రామీణ ఆరోగ్య ఉపకేంద్రాలు 148 ఉన్నాయి. 15 పీహెచ్‌సీల్లో 24 గంటలు, 9 చోట్ల 12 గంటలు వైద్య సేవలు అందిస్తున్నారు.  గ్రామీణ ఉప కేంద్రాల్లో కొన్ని శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం వీటి అద్దె కోసం నెలకు రూ.250 ఇస్తోంది. సిబ్బంది మరికొంత వేసుకుని అద్దె చెల్లిస్తున్నారు. ఈ కేంద్రాల్లో వైద్య పరికరాలు, ఇతర సామగ్రి లేవు. బైచిగేరిలో సబ్‌సెంటర్‌ భవనాన్ని నిర్మించినా ప్రారంభించలేదు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తున్నారు.


శిథిల భవనాలు

ఆదోని రూరల్‌: మండల పరిధిలో పెద్ద హరివాణం, పెద్ద తుంబళం పీహెచ్‌సీలు ఉన్నాయి. పెద్దహరివాణంలోని రెండు ఆరోగ్య ఉప కేంద్ర భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఐదు చోట్ల ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన సబ్‌సెంటర్‌లలో విద్యుత్‌ సౌకర్యం లేదు. మహిళలను వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక గదులు లేవు. మౌలిక వసతులు లేవు.

విద్యుత్‌ లేదు

హొళగుంద: ఎల్లార్తిలోని ఆరోగ్య ఉపకేంద్రంలో కనీస సౌకర్యాలు లేవు. ఈ కేంద్రం పరిధిలో25 మంది దాకా గర్భిణులు, బాలింతలకు వైద్యం అందుతోంది. తొమ్మిదేళ్ల నుంచి విద్యుత్‌ సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, తాగునీరు సైతం దొరకని పరిస్థితి. భవనం శిథిలావస్థకు చేరింది. 


చుట్టపు చూపు

హాలహర్వి: గూళ్యంలోని ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ 10 వేల జనాభా ఉంది. మందుల కొరత తీవ్రంగా ఉంది. ఎప్పుడు చూసినా ఆరోగ్య ఉపకేంద్రం తలుపులు తెరుచుకోవు. వైద్యం కోసం రోగులు వచ్చి వెనుతిరగాల్సిన పరిస్థితి. సిబ్బంది వారానికోసారి చుట్టపు చూపుగా వస్తారని గ్రామస్థులు తెలిపారు. 


మౌలిక వసతులు లేవు

ఆలూరు: హత్తి బెళగల్‌ ఆరోగ్య ఉప కేంద్రం పాఠశాల భవనంలో కొనసాగుతోంది. హత్తి బెళగల్‌, అగ్రహారం గ్రామాల నుంచి రోజుకు 30 మంది వరకు వైద్యం కోసం వస్తారు. ఇక్కడ ఇద్దరు హెల్త్‌ అసిస్టెంట్లు, నలుగురు ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేదు.


భవనం లేదు..  ప్రభావతి, ఏఎన్‌ఎం, బైచిగేరి, ఆదోని మండలం

మాకు సబ్‌ సెంటర్‌ భవనం లేదు. ఆరోగ్య ఉపకేంద్రానికి వచ్చిన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించాలంటే తప్పనిసరిగా ప్రత్యేక గది అవసరం. వారిని ఎక్కడ కలుసుకుని ఇంజెక్షన్‌ వేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రంలో ఇంజెక్షన్‌ వేస్తున్నాం. చిన్నారులు ఉన్నందున ఇబ్బందిగా ఉంది. అంగన్‌వాడీ భవనాన్ని కూడా ఖాళీ చేయమన్నారు. సబ్‌సెంటర్‌ ప్రారంభించేంత వరకూ పాఠశాలను మాకు కేటాయించాలి. ప్రతి బుధవారం 30 మందికి పైగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు టీకాలు వేయాల్సి ఉంటుంది. 


మందుల కొరత

ఎమ్మిగరూరు: మండల పరిధిలోని దైవందిన్నెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కె. తిమ్మాపురం, కలుగొట్ల, పార్లపల్లి, ఎర్రకోట, బనవాసి, కొటేకల్లు, గుడికల్లు-1, గుడికల్లు-2, కడివెళ్ల, కందనాతి గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. చాలా చోట్ల సొంత భవనాలు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఉప కేంద్రాల్లో పాము, కుక్కకాటు మందులు లేవు. జ్వరం వంటి సాధారణ జబ్బులకు మాత్రమే వైద్యం అందుతోంది.


ఆర్‌ఎంపీలే దిక్కు

మంత్రాలయం: మండల పరిధిలో మంత్రాలయం రామచంద్ర నగర్‌, రాఘవేంద్ర నగర్‌, మాధవరం, రాపురం, కలుదేవకుంట, రచ్చుమర్రి, మాలపల్లి, వగరూరు, సాతనూరులో సబ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటికి శాశ్వత భవనాలు లేవు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. వైద్య సిబ్బంది కొరత ఉంది. పది సబ్‌ సెంటర్లకు 8 మంది ఏఎన్‌ఎంలు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు రెగ్యులర్‌, మరో నలుగురు కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. మౌలిక వసతులు ఎక్కడా లేవు. దీంతో రోగులు వ్యైదం కోసం ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మిగనూరు. ఆదోని, కర్నూలుకు వెళుతున్నారు. 


పెద్దకడుబూరు: మండలంలో మొత్తం 7 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. విష పురుగులు కాటు వేస్తే వైద్యం అందడం లేదు. జలుబు, చిన్నపాటి జ్వరం వస్తే మందులను అందజేస్తున్నారు. రెగ్యులర్‌ ఆరోగ్య సిబ్బంది లేరు. రోగులు వైద్యం కోసం పట్టణాలకు వెళుతున్నారు. 


కోసిగి: పట్టణంలోని మూడో వార్డు ఆరోగ్య ఉప కేంద్రం కేవలం జ్వరం, జలుబు, టీకాలు వంటి సాధారణ సేవలకే పరిమితమైంది. పాము, కుక్కకాట వైద్యం కోసం పట్టణాలకు పరుగు పెట్టాల్సిందే. మండలంలో 10 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. ఏఎన్‌ఎంలలో ఒకరు రెగ్యులర్‌, ముగ్గురు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. మిగిలినవారు ఇటీవల గ్రామ సచివాలయం  ఉద్యోగాల భర్తీ ద్వారా వచ్చారు. 


ల్యాబ్‌ సేవలు దూరం 

తుగ్గలి: తుగ్గలి, పగిడిరాయి వైద్యశాలల్లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేరు. గర్భిణులు, జ్వర పీడితులు, క్షయ రోగులు పత్తికొండ, గుత్తి ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. 

Updated Date - 2020-03-02T11:06:13+05:30 IST