అర్చకులపై దాడి అమానవీయం
ABN , First Publish Date - 2020-12-03T05:55:03+05:30 IST
ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి అమానవీయమని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామి అన్నారు.

- కమలానంద భారతీ స్వామి
బండి ఆత్మకూరు, డిసెంబరు 2: ఓంకార క్షేత్రంలో అర్చకులపై దాడి అమానవీయమని గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీస్వామి అన్నారు. బుధవారం ఓంకారానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి గంగాఉమా సమేత సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తర్వాత అర్చకులు సుధాకర శర్మ, మృగఫణి శర్మ, చక్రపాణి శర్మను పరామర్శించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ అర్చకులపై దాడి సమాజంపై జరిగిన దాడి అన్నారు. కార్యక్రమంలో అర్చక సంఘాల నాయకులు, వీహెచ్పీ నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా
కర్నూలు(ఎడ్యుకేషన్): ఓంకారం అర్చకులపై చైర్మన్ ప్రతాపరెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. జిల్లా అధ్యక్షుడు పోలంకి రామస్వామి మాట్లాడుతూ అధికార దాహంతో అర్చకులపై దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నగర అధ్యక్షుడు జంపాల యోగానంద చౌదరి, బీజేపీ నాయకులు సారాయి రంగస్వామి, సందడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.