మహా శివరాత్రికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-02-12T11:06:48+05:30 IST

శ్రీశైలంలో ఈ నెల 14 నుంచి 24 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ముమ్మరం చేశారు. వేడుకలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది.

మహా శివరాత్రికి ఏర్పాట్లు

శ్రీశైలంలో కొనసాగుతున్న పనులు


శ్రీశైలం, ఫిబ్రవరి 11: శ్రీశైలంలో ఈ నెల 14 నుంచి 24 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను దేవస్థానం అధికారులు ముమ్మరం చేశారు. వేడుకలకు మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఏర్పాట్లపై కలెక్టర్‌ అధ్యక్షతన ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ సూచన మేరకు క్షేత్రంలో ఉచిత దర్శన క్యూలైన్‌, రూ.150 శీఘ్ర దర్శన క్యూలైన్‌, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేకంగా క్యూలైన్‌ నిర్మించారు. క్యూలైన్ల వద్ద షెడ్‌లను ఏర్పాటు చేశారు. అలాగే ఇరుముడి సమర్పించే శివస్వాములకు చంద్రవతి కల్యాణ మండపం వద్ద ప్రత్యేక క్యూలైన్‌ నిర్మించారు. ఈ క్యూలైన్‌ చంద్రవతి కల్యాణ మండపం నుంచి శివాజీగోపురం మీదుగా ఆలయంలోకి ఉంటుంది. తాత్కాలిక వసతి కోసం వివిధ చోట్ల షామియానాలు, షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తుల కోసం కైలాస ద్వారం భారీ షెడ్లు వేస్తున్నారు. కైలాస ద్వారం నుంచి భీముని కొలను వరకు తాగునీటి పైప్‌లైన్‌ వేస్తున్నారు.


శ్రీశైలం పీహెచ్‌సీ వద్ద తాత్కాలిక 30 పడకల వైద్యశాలను అందుబాటులో ఉంచారు. టూరిస్టు బస్టాండ్‌ వద్ద తాత్కాలిక టాయిలెట్లు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ ప్రదేశాలను చదును చేశారు. క్షేత్ర ప్రధాన ఆలయాల వద్ద విద్యుద్దీకరణ పనులు కొనసాగుతున్నాయి. పాతాళగంగ వద్ద భ్రమరాంబ, మల్లికార్జున ఘాట్ల వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లు, మరుగుదొడ్లు, షవర్‌బాత్‌లను నిర్మిస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన ఫెన్సింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. శిఖరేశ్వరం, సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు మహాశివరాత్రి స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు క్షేత్రంలో అదనపు సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. 


Updated Date - 2020-02-12T11:06:48+05:30 IST