ఇంతటితో సరిపెడతారా?

ABN , First Publish Date - 2020-04-08T10:51:48+05:30 IST

ఇంతటితో సరిపెడతారా?

ఇంతటితో సరిపెడతారా?

పాణ్యం పాజిటివ్‌ కేసు ఘటనపై విచారణ

కమిటీని నియమిస్తూ కలెక్టర్‌ ఆదేశాలు


కర్నూలు, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): పాణ్యం కరోనా పాజిటివ్‌ కేసు విషయమై విచారణకు కలెక్టర్‌ వీరపాండియన్‌ ఆదేశించారు. పాణ్యంకు చెందిన వ్యక్తి కరోనా అనుమానిత కేసుగా కర్నూలు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతూ ఈనెల 3న మృతి చెందిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి మృతి చెందాక వైద్యులు కుటుంబీకులను పిలిపించారు. తాము వెళ్లేసరికే మృతదేహాన్ని ప్యాక్‌ చేశారని కుటుంబీకులు అంటున్నారు. పైగా మృతదేహాన్ని దహనం చేయాలని సూచించినట్లు తెలిసింది. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబీకులు సందేహించినా భయపడాల్సిన పనేంలేదని అక్కడి వైద్యులు చెప్పి పంపించారు.


దీనిపై ఆంధ్రజ్యోతిలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్‌ వీరపాండియన్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఈ తప్పంతా ఆ వ్యక్తి కుటుంబీకులపై నెట్టేందుకు కొందరు ఉన్నతాధికారులు యత్నిస్తున్నట్లు సమాచారం. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అయితే పెద్దాసుపత్రిలో ఇలాంటి తప్పిదాలు జరిగినప్పుడల్లా విచారణ కమిటీలతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈసారైనా కారకులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-04-08T10:51:48+05:30 IST