మిర్చికి వైరస్
ABN , First Publish Date - 2020-10-19T11:15:40+05:30 IST
మిర్చికి వైరస్

తీవ్రంగా నష్టపోతున్న రైతులు
తెగుళ్లపై అవగాహన కల్పించరేం?
సలహాలతో ముంచుతున్న వ్యాపారులు
ఆదోని రూరల్, అక్టోబరు 18: మిర్చి రైతులను అప్పులపాలు చేయడానికి కొత్త సమస్య దాపురించింది. పంటకు జెమిని వైరస్ సోకడంతో దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పంటను పీకేస్తున్నారు. వైరస్ బారి నుంచి పంటను ఎలా కాపడుకోవాలో రైతులకు తెలియజేసి అవగాహన కల్పించాల్సిన వ్యవసాయాధికారులు కార్యాలయాలను దాటి బైటికి రావడం లేదు. దీంతో ఎరువుల దుకాణదారులు వ్యవసాయ శాస్త్రవేత్తల అవతారం ఎత్తుతున్నారు. వైరస్ గురించి ఏమీ తెలియకపోయినా ఉచిత సలహాలు ఇస్తున్నారు. తద్వారా నాసిరకం మందులు అంటగట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి పంటలు పండిస్తున్న రైతులకు కన్నీరే మిగులుతోంది. పంటకు ఆరంభంలోనే జెమినీ వైరస్ సోకడంతో చెట్టుకు ఉన్న ఆకులకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసంపీల్చే పురుగులు వాలి ఆకులో ఉండే రసాన్ని పీల్చడంతో ఆకులు లేత ఆకుపచ్చగా మారి ఆకులోని ఈకెలు పడవ ఆకారంగా పైకి ముడుచుకుంటున్నాయి. దీంతో చెట్టుకు పూత పూయడం లేదు, కాపు రావడం లేదు. ఈ వైరస్ నుంచి ఏ విధంగా రక్షించుకోవాలో తెలియక రైతన్నలు ఆ దోమల నివారణ కోసం పొలాల్లో చాలా చోట్ల ఆకుపచ్చని జిగురు అట్టలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా పంటలు వైరస్ బారిన పడ్డాయి. మండలంలోని దాదాపు 2450 ఎకరాలు (980 హెక్టార్లు) రైతులు మిర్చి పంటను సాగు చేశారు. ఒక్క కపటి గ్రామంలోనే 100 ఎకరాలు పైనే మిర్చి పంటలు వేశారు. సొంత భూమి ఉన్న వారు. రూ.లక్ష వెచ్చించి పెట్టుబడి పెట్టి పంట సాగు చేశారు. మరికొందరు రైతులు భూమిని గుత్తకు తీసుకొని మిర్చి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది మిర్చి పంటలకు సోకిన జెమిని వైరస్‌తో పంట దిగుబడి రాకపోవడం వల్ల తాము అప్పులపాలు కాక తప్పదని రైతులు వాపోతున్నారు. వైరస్ సోకకపోతే మిర్చి పంట నాలుగు కోతలలో ఎకరానికి 50 క్వింటాళ్లు పైనే వచ్చేదని, ఇప్పుడు 5 క్వింటాళ్లు కూడా దిగుబడి రాదని ఆవేదన చెందుతున్నారు.
ఈ ఏడాది ఆరంభంలోనే..
రెండు మూడు సంవత్సరాలుగా మిర్చి పంటలకు జెమిని వైరస్ సోకుతూనే ఉంది. అయితే నాలుగో కోత వచ్చే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో సోకేది. అప్పుడు దిగుబడిపై అంత ప్రభావం చూపలేదు. ఈ ఏడాది మాత్రం పంట సాగు చేసినప్పటి నుంచి మిర్చి పంట జెమిని వైరస్ బారిన పడింది. ముందుగా ఒక చెట్టుపై కూర్చున్న రసం పీల్చే పురుగులు మిగిలిన చెట్లపై కూడా వాలడంతో దాదాపు పంట మొత్తం వైరస్ సోకి పంటలను నాశనం చేస్తున్నాయి.
కార్యాలయాలకే అధికారులు పరిమితం
రైతులు ఏ పంటలు పండించారు? వాటి పరిస్థితి ఏమిటి? అన్న వివరాలు తెలుసుకోవాల్సిన వ్యవసాయాధికారులు కొందరు కార్యాలయాలకే పరిమితం అయ్యారు. దీంతో పంటలు వైరస్ బారిన పడితే ఏ మందు పిచికారీ చేయాలో అర్థం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మందులను ఎప్పుడు పిచికారీ చేయాలో, ఎంత మోతాదులో చేయాలో తెలియక తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పురుగుమందుల వ్యాపారుల సలహాలు పాటించాల్సిన పపరిస్థితి నెలకొంది.
ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది
నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెండెకరాల పొలం ఉంది. ఎకరా పొలంలో మూడు నెలల క్రితం రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టి మిర్చి పంట సాగు చేశాను. పెరుగుదల బాగుంది. కాని పంటకు ప్రారంభం నుంచే జెమిని వైరస్ సోకడంతో చెట్టుకు పూత రాలేదు, కాపు అంతకన్నా రాలేదు. సాగుకు, కుటుంబ పోషణకు కలిపి రూ.2 లక్షలకు పైగా అప్పు చేశాను. పంట దిగుబడి మాత్రం అసలు కాదుకదా వడ్డీకి కూడా రాదు. ఇలాంటి సమయాల్లోనే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది.
- చిన్నపీర్‌సాబ్, కపటి
గుత్తకు తీసుకొని సాగు చేశా
ఎకరానికి రూ.15 వేలు చెల్లించి రెండెకరాల్లో రూ.2 లక్షలు వెచ్చి మిర్చి పంట వేశాను. మునుపు సంవత్సరంలో మిర్చి పంటలకు జెమిని వైరస్ పంట నాలుగో కోతలో సోకేది. అప్పుడు వైరస్ ప్రభావం కనిపించేది కాదు. కాని ఈ ఏడాది పంట ఆరంభం నుంచే వైరస్ సోకింది.
- అంజికుమార్, కపటి
పంటను తొలగించాను
ఎకరా పొలంలో రూ.70 వేలు పైగా ఖర్చు పెట్టి మిర్చి పంట వేశాను. పంటకు జెమిని వైరస్ సోకడంతో కాపురాలేదు. దీంతో చేసేదేమీ లేక పంటను పెకిలించేశా.
- చంద్రమోహన్‌రెడ్డి, కపటి
విత్తనాల ప్రభావం
మిర్చి పంటకు వైరస్ సోకడానికి ప్రధాన కారణం విత్తనాల ప్రభావం కావచ్చు. వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. పంటలు వైరస్‌కు గురికాకుండా ఉండాలన్నా, దిగుబడి రావాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టూ రక్షణ పంటలైన జొన్న, మొక్కజొన్న వేయాలి. ఎకరానికి 10 చొప్పున జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి.
- హరేంద్ర, హారికల్చర్ అధికారి, ఆదోని
పంట మార్పిడి చేయాలి
క్రమం తప్పకుండా పంటలు మార్పిడి చేయాలి. పంటలకు వైరస్ సోకినప్పుడు కాపర్‌ఆక్సిక్లోరైడ్ (సీవోసీ)ను చెట్టు మొదల్లో వేయాలి. వైరస్ వచ్చిన పంటలను పెకిలించి తగలబెట్టాలి. వేసవి కాలంలో ట్రైకోడర్మల్ విరిడితో భూములను శుద్ధి చేయాలి.
- పాపిరెడ్డి, ఏవో