నలుగురికి పదవులు

ABN , First Publish Date - 2020-10-19T11:14:27+05:30 IST

నలుగురికి పదవులు

నలుగురికి పదవులు

బీసీ కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

జిల్లాలో బోయ, కుర్ణి, వీర శైవ, బేస్తలకు అవకాశం


కర్నూలు, ఆంధ్రజ్యోతి (న్యూస్‌ నెట్‌వర్క్‌): బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గంలో కుల సమీకరణలను పాటిస్తూ ప్రతి జిల్లాకు నలుగురు చైర్మన్లను నియమించింది.  కర్నూలు జిల్లా నుంచి బోయ, కుర్ణి, వీర శైవ లింగాయత్‌, బెస్త కార్పొరేషన్లకు చైర్మన్లుగా వైసీపీ విధేయులకు అవకాశమిచ్చింది. కర్నూలుకు చెందిన తెలుగు సుధారాణిని బెస్త కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించారు. ఆదోనికి చెందిన డాక్టర్‌ ఎ. మధుసూదన్‌ను బోయ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా, ఎమ్మిగనూరుకు చెందిన బుట్టా శారదమ్మను కుర్ణి కార్పొరేషన్‌ చైర్మన్‌గా, వై.రుద్రగౌడ్‌ను  వీర శైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. వైసీపీ కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి, నియామకాలను ధ్రువీకరించారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సీఎం జగన్‌ బీసీల పెన్నిధిగా నిలిచారని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హమీలను నెరవేర్చారని అన్నారు. జిల్లాలో బీసీలకు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా మార్కెట్‌ కమిటీకి బీసీ మహిళను చైర్మన్‌గా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని బీవై రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, సుధాకర్‌ తదితరులు  పాల్గొన్నారు. 


బెస్త కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధారాణి

బెస్త కార్పొరేషన్‌ చైర్మన్‌గా కర్నూలుకు చెందిన తెలుగు సుధారాణి నియమించారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ చైర్మన్‌గా తనను ఎంపికచేస్తారని ఊహించలేదని తెలిపారు. బీసీల అభ్యన్నతి కోసం ఎవరూ ఊహించని విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సాఽధారణ మహిళనైన తనలాంటి వారికి చైర్మన్‌ అవకాశం ఇవ్వడం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికే సాధ్యమైందని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు, జిల్లాలోని పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బెస్త కులస్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కర్నూలు నగరంలోని అశోక్‌ నగర్‌లో నివాసం ఉంటున్న తెలుగు సుధారాణి, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం కేవీ సుబ్బారెడ్డి ఉమన్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. సుధారాణి సోదరుడు అనిల్‌కుమార్‌ 2007 నుంచి జగన్‌ యువసేన విద్యార్థి విభాగంలో పని చేస్తున్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ సంప్రదాయ మత్స్యకారుల సంక్షేమ సంఘం సమైఖ్య అధ్యక్షుడిగా కూడా పని చేస్తున్నారు. 


వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రగౌడు

ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వైసీసీ నాయకుడు వై రుద్రగౌడు తాత వై గాదె లింగన్న గౌడు రెండుసార్లు కర్నూలు నుంచి స్వతంత్ర పార్ట్టీ అభ్యర్థిగా ఎంపీగా ఎన్నికయ్యారు. రుద్రగౌడు తండ్రి వైసీ వీరభద్రగౌడు ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందారు. వారి వారసత్వంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన రుద్రగౌడ్‌ టీడీపీలో చేరి ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. టీడీపీలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన ఆయన బీవీ మోహన్‌రెడ్డితో విభేదాల కారణంగా కాంగ్రెస్‌, ఆ తర్వాత వైసీపీలో చేరారు. రుద్రగౌడ్‌ ను ప్రభుత్వం వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపిక చేయటం పట్ల ఆయన సామాజికవర్గీయులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సహకారంతో తనకు ఈ పదవి దక్కిందని వై.రుద్రగౌడ్‌ అన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వీరశైవ లింగాయత్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. యువతకు కార్పొరేషన్‌ ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. వీర శైవ లింగాయత కళ్యాణ మండపాలు నిర్మిస్తానని తెలిపారు. 


కుర్ణి కార్పొరేషన్‌ చైర్మన్‌ బుట్టా శారదమ్మ

కుర్ణి కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎంపికైన బుట్టా శారదమ్మ ఎమ్మిగనూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బుట్టారంగయ్య సతీమణి. 2005లో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ కమిటీ మహిళా విభాగం ఉపాధ్యాక్షురాలుగా పనిచేశారు. 2005లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. 2011లో పార్టీని వీడి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వెంట వైసీపీలో చేశారు. 16 ఏళ్ళుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీకి చేసిన సేవలను గుర్తించి చైర్మన్‌ పదవిని సీఎం జగన్‌ ఇచ్చారని, కార్పొరేషన్‌ నుంచి వచ్చే నిధులతో కుర్ణి కులస్థుల అభివృద్ధికి పాటుపడతానని ఆమె తెలిపారు. వర్క్‌ షెడ్ల కోసం మూడు సెంట్ల కేటాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చాలా సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైందని, సీఎం దృష్టికి తీసుకెళ్లి  ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.  


వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మధుసూదన్‌

వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌గా తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని డాక్టర్‌ మధుసూదన్‌ అన్నారు. పదవికి అన్ని రకాలుగా న్యాయం చేస్తానని, బడుగు, బలహీన వర్గాల  అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేస్తే వాల్మీకులకు స్వయం ఉపాధి కల్పించేందుకు పాటుపడతానని తెలిపారు. వాల్మీకులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగితేనే వారి కుటుంబాలు బాగుపడతాయని అన్నారు. తాను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చానని, వాల్మీకులను తమ కుటుంబ సభ్యుల్లా భావించి వారికి ప్రభుత్వం నుంచి నిధులు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-19T11:14:27+05:30 IST