జగన్ వల్ల అల్లకల్లోలం
ABN , First Publish Date - 2020-03-08T12:44:15+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తనకు తిరుగులేదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాల

- సొంత ప్రయోజనాలే ధ్యేయంగా నిర్ణయాలు
- బీసీలకు తీరని ద్రోహం
- స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పండి
- టీడీపీ నేతల పిలుపు
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి తనకు తిరుగులేదని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాల వల్ల రాష్ట్రం అల్లకల్లోలమవుతోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. శనివారం కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌తదె కలిసి ఆమె విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ మోహన్‌రెడ్డి బీసీలను ఉద్ధ్దరిస్తానని ఎన్నెన్నో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని తుంగల్లో తొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో 59 శాతం రిజర్వేషన్లను ప్రకటించిన జగన్ మోహన్‌రెడ్డి తన పార్టీ వారి చేతనే హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేయించి కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వచ్చేలా చేశారని అన్నారు. ఇప్పటిదాకా బీసీలకు తెలుగుదేశం పార్టీ 33 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చిందని, అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఇప్పుడు బీసీలను నష్టానికి గురి చేశారని ఆరోపించారు. గత పది నెలల పరిపాలనలో ప్రజలందరినీ నష్టపరిచిన జగన్ మోహన్‌రెడ్డి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తినాల్సి వస్తుందని ముందుగానే గ్రహించి ఎలాగైనా గెలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారని అన్నారు. పదవులు ఉండాలంటే మీ నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో గెలవాల్సిందేనని వారిని హెచ్చరించారని అన్నారు. టీడీపీ, ఇతర పక్షాలకు గెలిచే అవకాశం లేకుండా చేసేలా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. చంద్రబాబునాయుడు, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన తాము బెదిరిపోమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున స్థానిక ఎన్నికల్లో అన్ని పదవులకు పోటీ చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీసీలకు తీరని ద్రోహం..
స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఎప్పటి నుంచో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలవుతున్నాయని, అయితే జగన్ మోహన్‌రెడ్డి బీసీలను ఎదుగుదలను భరించలేక ఈ ఎన్నికల్లో వారి రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీసీలంతా మేల్కొని ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థులపై కేసులు బనాయించేందుకే తాజాగా కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చారని సోమిశెట్టి ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేంద్రకుమార్, హనుమంతురావు చౌదరి, రవికుమార్, జేమ్స్, తిరుపాలుబాబు పాల్గొన్నారు.