హంస వాహన సేవ
ABN , First Publish Date - 2020-03-02T11:12:31+05:30 IST
అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఆదివారం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో వేద పండితులు ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి హంసవాహన సేవ నిర్వహించారు.

భక్తులను అనుగ్రహించిన జ్వాలా నారసింహుడు
సింహ వాహనంపై ఊరేగిన ప్రహ్లాదవరదుడు
ఆళ్లగడ్డ, మార్చి 1: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఆదివారం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో వేద పండితులు ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామికి హంసవాహన సేవ నిర్వహించారు. మొదటి జియర్ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామిని పట్టు పీతాంబరాలతో, కాంచీపురం పూలమాలలతో అలంకరించారు. ఈవో మల్లికార్జున ప్రసాదు ఆధ్వర్యంలో కీడాంబి లక్ష్మీనారాయణాచార్యులు పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు హైదరాబాదుకు చెందిన విజయకుమార్ ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు.
సూర్యప్రభ వాహనంపై అహోబిలేశుడు
ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రాత్రి స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ నిర్వహించారు. భానుడు రథసారథిగా, ఎర్రటి పూలమాలలు ధరించి నారసింహుడు 7 గుర్రాల సూర్యప్రభ వాహనంపై ఊరేగారు. కార్యక్రమానికి ఆర్ల వెంకటస్వామి ఉభయదారులుగా వ్యవహరించారు.
దిగువ అహోబిలంలో..
దిగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రహ్లదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద ఉన్న మండపానికి తోడ్కొని వచ్చారు. మండపానికి సమీపంలో మొదటి జీయర్ స్వామిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వేదపారాయణం చేస్తుండగా అర్చకులు ధ్వజ పతాకాన్ని ఎగుర వేశారు. ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను అహోబిల మఠానికి తీసుకెళ్లారు. 46వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు అభిషేకం, సాయంత్రం భేరిపూజ చేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానించేందుకు భేరితాటను మోగించారు. కార్యక్రమాలకు అహోబిలం మఠం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
సింహవాహనంపై ప్రహ్లదవరదుడు
దిగువ అహోబిలంలో ప్రహ్లదవరదుడు ఆదివారం భక్తులకు సింహవాహనంపై దర్శనమిచ్చాడు. కార్యక్రమానికి తాడిపత్రికి చెందిన దామోదరబాబు, గోవర్ధనబాబు ఉభయదారులుగా వ్యవహరించారు.
వేడుకల్లో నేడు
ఎగువ అహోబిలంలో సోమవారం ఉత్సవం, అభిషేకం, హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో హంస వాహన సేవ, అభిషేకం, సూర్యప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.