ఏసీబీ దాడులు

ABN , First Publish Date - 2020-09-03T11:01:56+05:30 IST

ఎమ్మిగనూరు తహసీల్దారు కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఏసీబీ దాడులు

ఎమ్మిగనూరు తహసీల్దారు కార్యాలయలో విచారణ

నలుగురు ప్రైవేటు వ్యక్తుల నుంచి నగదు స్వాధీనం

ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి: ఏసీబీ డీఎస్పీ


ఎమ్మిగనూరు/ రూరల్‌, సెప్టెంబరు 2: ఎమ్మిగనూరు తహసీల్దారు కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో తహసీల్దారు వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రామయ్య కార్యాలయంలో లేరు. ఏసీబీ అధికారులు వచ్చిన కాసేపటి వారు కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ అధికారులు వచ్చీరాగానే కార్యాలయంలో ఉన్న సిబ్బందిని, వివిధ పనుల నిమిత్తం వచ్చినవారిని ఎక్కడిక్కడే నిలిపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఏఏ పనుల నిమిత్తం వచ్చారని ఏసీబీ డీఎస్పీ జేసీ శివనారాయణ, ఏసీబీ సిబ్బంది ఆరా తీశారు. కార్యాలయంలోకి ఇతరులు రాకుండా తలుపులను మూసివేసి విచారణ చేపట్టారు. కార్యాలయానికి వచ్చిన డీలర్లు, సిబ్బంది వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.6040 స్వాదీనం చేసుకున్నారు. పాసు పుస్తకం కోసం వచ్చిన ఓ రైతును ఎంతకాలం నుంచి తిరుగుతున్నది అడిగి తెలుసుకున్నారు. పాసు పుస్తకం ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆర్‌ఐని అడిగారు. దీంతో సర్వే చేయించుకుని, ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాలని రైతుకు సూచించామని ఆర్‌ఐ తెలిపారు. కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ దాడుల విషయం తెలుసుకున్న కొందరు వీఆర్వోలు కార్యాలయం వైపు తొంగి చూడలేదు. 


ప్రజలు ఫిర్యాదు చేశారు: ఏసీబీ డీఎస్పీ

ఎమ్మిగనూరు తహసీల్దారు కార్యాలయంలో పనుల జాప్యం అవుతున్నాయని, అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు 14400కు సమాచారం ఇచ్చారని ఏసీబీ డీఎస్పీ జేసీ శివనారాయణ తెలిపారు. అందుకే దాడులు నిర్వహించామని అన్నారు. కార్యాలయంలో నలుగురు ప్రైవేటు వ్యక్తులను గుర్తించామని, ఓ వ్యక్తి నుంచి రూ.6040 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు అధికారులకు ప్రజల నుంచి సమస్యలపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్నింటిని పరిష్కరించారు, జాప్యం జరగడానికి కారణాలు తెలుసుకుంటున్నామని వెల్లడించారు. మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఎంత మందికి భూమి పట్టాలు ఇచ్చారు, అక్రమంగా ప్రభుత్వ భూమిని సాగుచేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో విచారిస్తామని తెలిపారు. విచారణ గురువాకం కూడా కొనసాగిస్తామని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు తేజేశ్వరరావు, గౌతమి, ఎస్‌ఐ ఇంతియాజ్‌ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-03T11:01:56+05:30 IST