ఊరికి పంపండి..లేదంటే నడిచి వెళ్తాం

ABN , First Publish Date - 2020-05-09T08:27:27+05:30 IST

వలస కార్మికులను కరోనా లాక్‌డౌన్‌ ఎక్కడికక్కడ నిర్బంధించేసింది. పొట్ట చేతపట్టుకుని వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఇరుక్కపోయారు. కన్న ఊరికి ఎలా వెళ్లాలో తెలియక.

ఊరికి పంపండి..లేదంటే నడిచి వెళ్తాం

వేలాదిగా ఇతర రాష్ట్రాల కార్మికులు, వ్యాపారులు 

ఆన్‌లైన్‌లో 7,746 మంది నమోదు

బీహర్‌, ఝార్ఖండ్‌కు 1,926 మంది తరలింపు 

ఆకలితో అలమటిస్తున్న కార్మికులు

ఏర్పాట్లు చేస్తున్నాం: జడ్పీ సీఈవో


కర్నూలు(అర్బన్‌), మే 8: వలస కార్మికులను కరోనా లాక్‌డౌన్‌ ఎక్కడికక్కడ నిర్బంధించేసింది. పొట్ట చేతపట్టుకుని వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఇరుక్కపోయారు. కన్న ఊరికి ఎలా వెళ్లాలో తెలియక.. కుటుంబాలకు, ఆత్మీయులకు దూరంగా.. ఆకలితో అల్లాడిపోతున్నారు. వాళ్లను సొంత ప్రాంతాలకు చేర్చడానికి ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. అధికారులు వివరాలు తీసుకుంటున్నారు కానీ కాలయాపన తప్ప పని కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనులు చేసుకుని బతుకుతున్నారు. హోటళ్లు, బంగారు షాపులు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, సిమెంట్‌ కంపెనీల్లో వేలాది మంది పని చేస్తున్నారు. కొందరు కుటుంబాలతో సహా జిల్లాకు వచ్చారు. మరికొందరు కుటుంబాలను సొంత ప్రాంతంలోనే ఉంచి ఒంటరిగా వచ్చారు. కర్నూలు నగరంలోనే అస్సాంకు చెందిన వాళ్లు హోటళ్లలో దాదాపు 260 మంది పని చేస్తున్నారు. బంగారు షాపుల్లో అయితే వేలాది మంది ఉన్నారు.


వీరంతా జనవరిలో ఇక్కడికి వచ్చారు. గతంలో రెండు నెలలకోసారి సొంత ప్రాంతానికి వెళ్లి వచ్చేవాళ్లమని, ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే ఉండి పోయామని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కుటుంబసభ్యులను ఎప్పుడు చూసేదీ తెలియకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంకు చెందిన మారం అలీ లస్కర్‌, షాబుద్దీన్‌తో పాటు 50 మంది తాము అస్సాంలోని హైలంబీ జిల్లా లాల్‌ పానిగావ్‌ గ్రామం నుంచి ఇక్కడకు వచ్చామని, ఎలాగైనా తమ స్వస్థలాలకు పంపించాలని శుక్రవారం అధికారులను కోరారు.


ఈ లాక్‌డౌన్‌లో పని లేక, చేతిలో ఉన్న డబ్బు అయిపోయి తిండికి కూడా ఇబ్బందిపడుతున్నామని అన్నారు. రోడ్డు మీద దాతలు పెట్టే తిండితో రోజులు గడుపుతున్నామని ఆవేదన చెందారు. అక్కడ కూడా లాక్‌డౌన్‌ వల్ల తమ కుటుంబ సభ్యుల పరిస్థితి బాగా లేదని, వెంటనే తమను స్వగ్రామాలకు చేర్చాలని వాళ్లు కోరుకున్నారు. తమ వివరాలను వారం కింద అధికారులు తీసుకున్నారని, అయితే ఇప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే నడిచి వెళతామని అంటున్నారు. 


మధ్యప్రదేశ్‌ నుంచి 860, ఉత్తర ప్రదేశ్‌ నుంచి 1800 మంది వచ్చి పానీపూరీ బండ్లు పెట్టుకుని జీవిస్తున్నారు. స్వర్ణకార షాపుల్లో 1,600 మంది పని చేస్తున్నారు. బీహర్‌ నుంచి వచ్చిన 1300 కార్మికులు వివిధ కర్మాగారాల్లో పని చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇతర రంగాల్లో దాదాపు 5వేల మంది బయటి రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలు పని చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో చిక్కుకునిపోయిన మధ్యప్రదేశ్‌కు చెందిన మనోజ్‌ భల్లా కరోనా లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారం లేదని, పోలీసుల ఆంక్షలతో ఇళ్లలోనే ఉండిపోతున్నామని అన్నాడు. వ్యాపారం చేయకపోతే ఇక్కడ మేం ఏం తినాలి? ఇండ్లకు ఏం పంపాలి? అని ఆవేదన చెందాడు.


లాక్‌డౌన్‌ ఇచ్చి పరిస్థితి ఇలా తయారవుతుందని ఊహించలేదని, సొంత ప్రాంతాలకు తమలాంటి వాళ్లను పంపించాలని కోరాడు. ఇక్కడ ఉంటున్న కాలనీల చుట్టూ కంప వేశారని, చేతిలో డబ్బులు లేవని, తిండికి కూడా ఇబ్బందిగా ఉందని అన్నాడు. తమ రాష్ట్రాల అధికారులకు ఫోన్‌ చేసి తమ ఇబ్బందులు చెప్పినా పట్టించుకోవడం లేదని అన్నారు. కర్నూలు జిల్లా అధికారులైనా తమను ఇండ్లకు పంపించే ఏర్పాటు చేయాలని కోరారు. 


వివరాల సేకరణలో జాప్యం..

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వలస కార్మికుల వివరాలను నగరంలోని జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌ ద్వారా సేక రిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి తిరుగుతున్న గ్రామ వలంటీర్లు వారి జాబితాను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 7,746 మంది ఇతర రాష్ట్రాల వారి పేర్లను సేకరించారు. ఇప్పటి వరకు కేవలం 1,926 మందిని మాత్రమే తరలించి చేతులు దులిపేసుకున్నారు. ఇంకా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి పేర్ల సేకరణ నత్తనడకన నడుస్తోంది. ఇలా సేకరించిన వారిని వారి ప్రాంతాలకు తరలించే విడతలవారి ప్రక్రియ సాగుతోంది. పేర్లు నమోదు అయ్యాక వారి సెల్‌ ఫోన్‌కు ఓటీపీ, ఆ తర్వాత వారిని తరలించే వివరాలు మెసెజ్‌ల రూపంలో వస్తాయిని అధికారులు చెబుతున్నారు.


అయితే పేర్లు నమోదు చేసుకొని వారం రోజులైనా అధికారుల నుంచి స్పందన లేదని పలువురు కూలీలు  ఆవేదన  వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సిమెంట్‌ కర్మాగారంలో కార్మికులు కోవెలకుంట్ల్ల వద్ద చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో వారిని ప్రత్యేక బస్సుల్లో అధికారులను తరలించారు. అలాగే తమను ఎందుకు పంపరని హోటళ్లలో పని చేసే ఇతర ప్రాంతాల కూలీలు, పానీపూరి విక్రయించుకొనే చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా బీహార్‌కు 760 మందిని, ఝార్ఖండ్‌కు 1,160 మందిని ప్రత్యేక రైళ్లలో తరలించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌కు మరో 1000 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జడ్పీ సీఈవో ఎం. వెంకటసుబ్బయ్య తెలిపారు. 


నడిచి వెళ్లాలని అనుకుంటున్నాం: అమిత్‌ తివారీ

వలంటీర్లు మా ఇంటికి వచ్చి వివరాలు సేకరించుకొని వెళ్లారు. ఇక అంతే. మా ప్రయాణం గురించి మాట్లాడటం లేదు. దీంతో  నడిచి వెళ్లాలని అనుకుంటున్నాం. పిల్లా పాపలతో యూపీ నుంచి వచ్చి పానీపూరీ వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాం. లాక్‌డౌన్‌ వల్ల మాకు తిండి కూడా దొరకడం లేదు. దుకాణాల్లో సరుకులు లభ్యం కావడం లేదు. సంపాదించుకున్నదంతా అప్పుల కింద జమచేశాం. ఇలా లాక్‌ డౌన్‌ వచ్చి అతలాకుతలం చేస్తుందని అనుకోలేదు. 

 

రెండు రోజులుగా పడిగాపులు: మారం అలీ లస్కర్‌, ఉత్తర ప్రదేశ్‌ 

రెండు రోజులుగా పేర్ల నమోదు కోసం జిల్లా పరిషత్‌ వద్ద పడిగాపులు కాశాం. కానీ ఎప్పుడు పంపుతారో తెలియదు. తినేందుకు తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల వద్ద తల్లితండ్రులు మాపై బెంగతో ఉన్నారు. వయసుపై బడిన వారు వారి గురించి దిగులుగా ఉంది. అధికారులు వెంటనే స్పందించి స్వస్థలాలకు పంపాలి. 

Updated Date - 2020-05-09T08:27:27+05:30 IST