తగ్గుముఖం పట్టిందట!

ABN , First Publish Date - 2020-05-08T08:04:10+05:30 IST

ఢిల్లీ కాంటాక్ట్‌ కేసును క్వారంటైన్‌కు పంపారు..

తగ్గుముఖం పట్టిందట!

జిల్లాలో 540 పాజిటివ్‌ కేసులు

డిశ్చార్జ్‌లు 168, యాక్టివ్‌ 360

రోజువారీ పరీక్షల వివరాల్లో గోప్యత

విస్తుగొలుపుతున్న అధికారుల ప్రకటన


కర్నూలు(ఆంధ్రజ్యోతి): 


- ఢిల్లీ కాంటాక్ట్‌ కేసును క్వారంటైన్‌కు పంపారు. వారం తర్వాత అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. అతని కుటుంబంలోని ఓ గర్భిణికి ఏప్రిల్‌ 5న వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 25న ఆమెకు పాజిటివ్‌ అని తేల్చారు. ఈ ఘటన ఆత్మకూరులో కలకలం రేపింది.


- ఢిల్లీ కాంటాక్ట్‌గా గుర్తించి.. ఓ వ్యక్తిని మార్చి 27న క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 19న అతనికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ 22 రోజుల వ్యవధిలో ఢిల్లీ వెళ్లొచ్చినవారి ప్రైమరీ కాంటాక్ట్‌లకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించలేదు. అతనికి పాజిటివ్‌ అని తేలిన నాలుగు రోజులకు.. ఆయన కుటుంబంలో 9 మందికి వైద్య పరీక్షలు చేశారు. తుగ్గలిలో వెలుగు చూసిన ఈ ఘటనను తలచుకుని స్థానికులు నేటికీ ఆందోళన చెందుతున్నారు. 


యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న రోజువారీ స్వాబ్‌ పరీక్షల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఏ ప్రాంతంలో ఎందరికి పరీక్షలు నిర్వహించారు..? పాజిటివ్‌ వచ్చిన వారికి ఎన్ని రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారో చెప్పడం లేదు. మరో 400 మంది ఫలితాలు రావాల్సి ఉందని అంటున్నారు. అందుకే రోజువారీ వివరాలను ప్రకటించడం లేదు. కర్నూలు జీజీహెచ్‌ వైరాలజీ ల్యాబ్‌లో ఎన్ని పరీక్షలు చేస్తున్నారు? తిరుపతి ల్యాబ్‌కు పంపినవి ఎన్ని..? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తెలియని పరిస్థితి. గడచిన 41 రోజుల్లో జిల్లాలో 540 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కర్నూలు నగరపాలిక కమిషనర్‌కు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన బదిలీ అయ్యారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాకు వచ్చిన ప్రత్యేక అధికారులు కనిపించడంలేదు. కమిషనర్‌తో కలిసి పనిచేసిన మరో ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే.. జిల్లాలో కరోనా తుగ్గముఖం పట్టిందని అధికారులు ప్రకటించడం విస్తుగొలుపుతోంది. 


గణాంకాలపై అస్పష్టత

గడచిన 45 రోజుల్లో జిల్లాలో సుమారు 15 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ వాటి వివరాలను బహిర్గతం చేయడం లేదు. ఇక రోజువారీ లెక్కల వివరాల్లో స్పష్టత ఉండటం లేదు. ఈ నెల ఆరో తేదీ నాటికి 400 దాకా పెండింగ్‌ కేసులు ఉన్నాయని అంటున్నారు. వారికి వైద్య పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పడం లేదు. నమూనాలు ల్యాబ్‌కు పంపితే, ఫలితాలు ఎప్పటికి వస్తాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. ఫలితాలు వచ్చే వరకు అనుమానితుల కుటుంబ సభ్యులకు, కాంటాక్ట్‌ కేసులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. ఈ కారణంగానే జిల్లాలో పాజిటివ్‌ కేసులు భారీ స్థాయికి చేరాయి. ఇప్పటికీ జిల్లాలో ఏదో మూలన కరోనా వెలుగుచూస్తూనే ఉంది.

 


12 రోజుల్లో పతాక స్థాయికి..

జిల్లాలో పాజిటివ్‌ కేసులు మొదలైన 41 రోజుల్లోనే 540 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఏప్రిల్‌ వరకు రోజుకు సగటున 13 కేసులు నమోదు అయ్యాయి. గడచిన వారం నుంచి ఆ సగటు 22కు చేరింది. ఈ వారం రోజుల్లో 153 మందికి, 5 రోజుల్లో 100 మందికి కరోనా సోకినట్లు తేలింది. తొలి వంద కేసుల నమోదుకు 19 రోజులు పడితే.. ఆ తర్వాత వారం రోజుల్లోనే రెండు వందల కేసులు వచ్చాయి. మరో ఆరు రోజులకు మూడు వందల కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మూడు రోజులకు నాలుగు వందలు అయ్యాయి. మరో నాలుగు రోజులు గడిచాక 500 మార్కును దాటింది. అధికారులు జిల్లాలో బిగ్‌ రిలీఫ్‌ అని ప్రకటిస్తున్నారు. కానీ పక్క జిల్లాల గణాంకాలతో పోలిస్తే కర్నూలు జిల్లా నేటికీ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఉందని తెలుస్తోంది.


ఇప్పటికే భారీ కేసులు నమోదైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కర్నూలు జిల్లా కంటే ఎక్కువ మంది డిశ్చార్జి అయ్యారు. కృష్ణాలో 38%, గుంటూరులో 40% డిశ్చార్జి అయ్యారు. కానీ జిల్లాలో మాత్రం అన్ని జిల్లాల కంటే తక్కువగా 35% మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. కర్నూలు జిల్లా కంటే ముందే మూడో దశకు చేరుకున్న కృష్ణా జిల్లాలో నేటికీ భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొరుగింటి వారిని పలకరించేందుకు కూడా బయటకు రావద్దని ఆ జిల్లా కలెక్టర్‌ ఓ వీడియో సందేశం విడుదల చేయడం.. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. అలాంటిది కర్నూలు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. 

Updated Date - 2020-05-08T08:04:10+05:30 IST