శ్రీశైలానికి 3.06 లక్షల క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-08-18T10:25:00+05:30 IST

శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలతో జలాశయాలు కళకళలాడు తున్నాయి. జూరాల జలాశయం నుంచి 3.02లక్షల క్యూసెక్కుల నీ

శ్రీశైలానికి 3.06 లక్షల క్యూసెక్కులు

జూరాల నుంచి విడుదల

పూర్తిస్థాయి మట్టానికి చేరువలో తుంగభద్ర 


కర్నూలు(అగ్రికల్చర్‌)/హాలహర్వి, ఆగస్టు 17:  శ్రీశైలం, తుంగభద్ర డ్యాంలకు వరద కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలతో జలాశయాలు కళకళలాడు తున్నాయి. జూరాల జలాశయం నుంచి 3.02లక్షల క్యూసెక్కుల నీరు వదిలారు. సుంకేసుల నుంచి 4,311 క్యూసెక్కుల నీరు వస్తోంది. మొత్తం శ్రీశైలానికి రూ.3.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 873.70 అడుగుల వద్ద 157.5 టీఎంసీలు ఉంది.


ఎగువన కర్ణాటక, తెలంగాణాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతు న్నారు. తుంగభద్ర డ్యాంకు 28,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1632.48 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నిల్వ 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం 98.855 టీఎంసీల నీరు ఉంది. దీంతో సోమవారం బోర్డు అధికారులు 18 గేట్లను ఎత్తి నీటిని 44,507 క్యూసెక్కులు నదికి విడుదల చేశారు. నదీతీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వారం రోజుల్లో శ్రీశైలం, మూడు రోజుల్లో తుంగభద్ర పూర్తిస్థాయి మట్టానికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.


తుంగభద్ర, కృష్ణాలో ప్రవాహంపై నీటి పారుదలశాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం 12 మండలాల్లో 8 మి.మీ. నుంచి 16 మి.మీ. వర్షం నమోదైంది. ఓర్వకల్లులో 16, హాలహర్విలో 14.2, పగిడ్యాలలో 12.4, వెల్దుర్తిలో 12.4, ఆలూరులో 11.6, కోసిగిలో 11.2, సంజామలలో 10.6, గడివేములలో 9.2, మంత్రాలయంలో 9.2, కర్నూలులో 8.4, బండిఆత్మకూరులో 8.2 మి.మీ. వర్షం పడింది. జిల్లాలో 6.6 మి.మీ. సగటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-18T10:25:00+05:30 IST