సంచలనాలు@ కర్నూలు
ABN , First Publish Date - 2020-04-28T10:16:39+05:30 IST
కరోనా దెబ్బకు నెల రోజుల్లో జిల్లా రూపు రేఖలే..

ఒక్క నెల 292 కేసులు
మార్చి 28న మొదటి కేసు
30 రోజుల్లో 292కి చేరిక
15 రోజుల్లో 200 కేసులు
రాష్ట్రంలో తొలి స్థానం
ఆ ఘటనతో పాజిటివ్ పైపైకి..
కర్నూలు(ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు నెల రోజుల్లో కర్నూలు జిల్లా రూపు రేఖలే మారిపోయాయి. ప్రశాంతమైన జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటిదాకా ఒక్క కేసు కూడా లేదని జిల్లా వాసులు నిబ్బరంగా ఇళ్లలో గడిపారు. సరిగ్గా నెల క్రితం మార్చి 28న నొస్సంలో తొలి కేసు నమోదై జిల్లాను కలవరపాటుకు గురిచేసింది. ఈ కేసుతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో 11వ స్థానంలో నిలిచింది. నెల తిరిగే సరికి అన్ని జిల్లాలను దాటుకుంటూ మొదటి స్థానానికి చేరుకుంది. నొస్సం కేసు తరువాత ప్రైవేట్ వైద్యుడి మరణం, ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో ఆరుగురికి పాజిటివ్, ఏడుగురు వైద్యులకు పాజిటివ్, ఓ వార్డు వలంటీరు పాజిటివ్.. ఇలా వరుసగా కేసులు పెరుగుతూ పోయాయి. రాష్ట్రంలోనే కాదు.. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. నేటికీ పరిస్థితి అదుపులోనికి రాలేదు. నియంత్రణ చర్యలో జిల్లా యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు మిన్నంటుతున్నాయి. ఈ పరిస్థితిలో జిల్లాలో లాక్‌డౌన్ ఇంకెన్ని నెలలు పొడిగించాలోనని రాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
ఆ ఒక్కటితో మొదలై..
నొస్సం కేసు నమోదై నెల గడిచింది. ప్రస్తుతం జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 292కు చేరింది. అసాధారణ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా పరిస్థితిని చూసి జిల్లా అధికారులే భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం 15 రోజుల్లోనే 200 కేసులను దాటేసిన జిల్లా.. రికార్డులకెక్కింది. రోజుకు సగటున సుమారు పది కేసులు నమోదయ్యాయి. తొలి కేసు వెలుగు చూశాక 8 రోజులలో (ఏప్రిల్ 5 నాటికి) జిల్లాలో 50 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 10 రోజుల్లో ఈ సంఖ్య 100కు చేరింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ కేవలం 4 రోజుల్లో మరో 50 కేసులు వెలుగు చూశాయి. రోజుకు సగటున 12 ప్రకారం 150కి చేరాయి. ఆ 4 రోజుల్లోనే ఓ ప్రైవేట్ వైద్యుడి ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ వైద్యుడి మరణంతో నివురు గప్పిన నిప్పులా ఉన్న పాజిటివ్ కేసుల ఉనికి బట్టబయలైంది. ఆ తరువాత మూడు రోజుల్లోనే (ఏప్రిల్ 20, 21, 22) మరో 50 కేసులు నమోదై.. 200 మార్కును జిల్లా దాటేసింది. ఈ నెల 23 నుంచి పరిస్థితి మరింత విషమించింది. గడచిన ఐదు రోజుల్లో ఏకంగా 92 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా వైరస్ విస్తరిస్తూ.. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపింది.
సంచలనాలకు కేంద్ర బిందువు
కేసుల సంఖ్యలోనే కాదు.. ఢిల్లీ వెళ్లొచ్చినవారు, ప్రైవేట్ వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్న వారితో కరోనా సంచలానాలకు కర్నూలు జిల్లా కేంద్ర బిందువైంది. ఆ వైద్యుడి వద్ద చికిత్స పొందిన వారితోనే పాజిటివ్ కేసుల భారీగా పెరిగిందన్న విషయాన్ని జిల్లా యంత్రాంగమూ అంగీకరించింది. దీనికి తోడు విధుల్లో ఉన్న వైద్యులు కూడా కరోనా బారిన పడ్డారు. అందులో ఓ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు ఉండటం గమనార్హం. ఇప్పటి దాకా జిల్లాలో కరోనా పాజిటివ్‌తో తొమ్మిది మంది మరణించారు.
తేదీ కేసులు మరణాలు
మార్చి 28 1
ఏప్రిల్ 4 3
ఏప్రిల్ 5 52 1(డెత్)
ఏప్రిల్ 6 18
ఏప్రిల్ 8 1
ఏప్రిల్ 10 2
ఏప్రిల్ 11 5
ఏప్రిల్ 12 2
ఏప్రిల్ 14 9 1(డెత్)
ఏప్రిల్ 15 22
ఏప్రిల్ 17 13 1(డెత్)
ఏప్రిల్ 18 6 1(డెత్)
ఏప్రిల్ 19 26 1(డెత్)
ఏప్రిల్ 20 16
ఏప్రిల్ 21 10
ఏప్రిల్ 22 19
ఏప్రిల్ 23 31 2(డెత్)
ఏప్రిల్ 24 27 1(డెత్)
ఏప్రిల్ 25 14 1(డెత్)
ఏప్రిల్ 26 04
ఏప్రిల్ 27 13