వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం.. వల్లభనేని వంశీపై ఆరోపణలు

ABN , First Publish Date - 2020-12-15T18:03:56+05:30 IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు.

వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం.. వల్లభనేని వంశీపై ఆరోపణలు

విజయవాడ : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం నాడు మధ్యాహ్నం వైసీపీ నేత మొగిలిచర్ల జోజిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. అప్రమత్తమైన అనుచరులు అడ్డుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుడు కోట్లుపై జోజిబాబు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు నేతలు దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దళితులకు రావాల్సిన టెండర్లను అడ్డుకుంటున్నారు. దళితులకు కాంట్రాక్ట్ పనులు ఎందుకంటూ అడ్డుకుంటున్నారు. కాంట్రాక్టుల కోసం వైసీపీని నాశనం చేస్తున్న ఎమ్మెల్యే వంశీ, కోట్లుపై అధిష్టానం చర్యలు తీసుకోవాలిఅని జోజిబాబు తీవ్ర ఆవేదనతో చెబుతున్నారు.


అప్పట్నుంచి.. ఇప్పటి వరకూ..!

కాగా.. టీడీపీకి దూరమైన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నియోజకర్గంలో రెండ్రోజులకోసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వంశీ-యార్లగడ్డ అనుచరులు, వర్గీయులు కొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఈ గొడవలపై నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు-ఎమ్మెల్యే వంశీల మధ్య తలెత్తిన విబేధాలకు ఫుల్ స్టాప్ పెట్టి వైఎస్ జగన్.. వాళ్లిద్దర్నీ కలిపారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో కాస్త గొడవలు తగ్గాయనని కార్యకర్తలు, అనుచరులు భావించారు. అయితే ఇప్పుడు ఏకంగా వైసీపీ నేతే ఇలా సంచలన ఆరోపణలు చేస్తూ ఆత్మహత్యాయత్నం చేయడం గమనార్హం. మొత్తానికి చూస్తే నియోజకర్గంలో ఇప్పట్లో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు.

Updated Date - 2020-12-15T18:03:56+05:30 IST