ప్రభుత్వ సాయం పంపిణీలో పాల్గొన్న వ్యక్తికి.. పాజిటివ్ వచ్చిందని తెలియడంతో..
ABN , First Publish Date - 2020-04-05T15:27:25+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నా వైసీపీ నాయకుల ప్రచార..

ఇదేం సాయం..?
కరోనా ప్రభుత్వ సాయం పంపిణీలో రాజకీయ కక్కుర్తి
ప్రచారం కోసం వైసీపీ నాయకుల తాపత్రయం
గుంపులుగుంపులుగా వెళ్లి అందజేత
వైరస్ భయంతో హడలెత్తిపోతున్న లబ్ధిదారులు
రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని అధికారుల ఆదేశం
విజయవాడ(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నా వైసీపీ నాయకుల ప్రచార తాపత్రయం మాత్రం ఆగలేదు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించేందుకు శనివారం వైసీపీ నాయకులు గుంపులుగుంపులుగా బయల్దేరారు. ఈ నెల 1న సామాజిక పింఛన్ల పంపిణీ సమయంలోనూ వైసీపీ నేతల ప్రచార కక్కుర్తి కనిపించింది. శనివారం కూడా సుమారు పదిమంది ఒకేసారి వచ్చి వెయ్యి సాయం అందిస్తూ ఫొటోలు దిగుతుండటంతో లబ్ధిదారులు బెంబేలెత్తిపోయారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో వైసీపీ నేతలు ప్రచారానికి ప్రాధాన్యమిస్తూ గుంపులుగా రావడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వలంటీర్లపై బూతు పురాణం
విజయవాడ మాచవరం 26వ వార్డు పరిధిలో పనిచేసే సచివాలయ మహిళా సిబ్బందిపై వైసీపీ నాయకులు బూతుపురాణం ఎత్తుకున్నారు. తాము చెప్పిన వారి ఇళ్లకు తమతో పాటు వచ్చి తమ చేతులమీదుగా ప్రభుత్వ సాయం అందించాలని, లేకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని.. గతంలో టీడీపీలో ఉండి ప్రస్తుతం వైసీపీలో పెత్తనం చేస్తున్న నాయకుడు బెదిరింపులకు దిగారు. దీంతో సచివాలయ సిబ్బంది ఏమీ చేయలేక ప్రభుత్వ సాయాన్ని ఆయన ద్వారా అందించారు. ప్రభుత్వ సొమ్మును ఎలాంటి హోదా లేని ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవడం అంటే దొంగతనంతో సమానమని, ఆ దిశగా వైసీపీ నాయకులపై కేసులు పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బంటుమిల్లిలో ప్రభుత్వ సాయం చేస్తున్న వైసీపీ నేతలను టీడీపీ నాయకులు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొగల్రాజపురంలో దుర్గగుడి ట్రస్టు సభ్యురాలు సుజాత ప్రభుత్వ సాయాన్ని పంపిణీ చేశారు. వీరులపాడు మండలం బోడవాడలో వైసీపీ నాయకుడు శీలం భాస్కర్‌రెడ్డి ప్రభుత్వ సాయం అందించారు. చాట్రాయి మండలం జనార్ధనవరంలో, తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో, బంటుమిల్లి మండలం అర్తమూరులో, పెడన మండలం నందిగామలో వైసీపీ నాయకులే ప్రభుత్వ సాయం అందించారు.
‘స్థానిక’ అభ్యర్థుల చేతులమీదుగా..
పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ సాయం అందజేతలో పాల్గొనే వారిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. వీరు వలంటీర్లను పక్కనపెట్టి మరీ ప్రభుత్వ సొమ్మును తమ చేతులమీదుగా పంపిణీ చేశారు. స్పందించిన అధికారులు శనివారం నాటి ప్రభుత్వ సాయం పంపిణీలో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డబ్బు లబ్ధిదారులకు ఇవ్వాలని వలంటీర్లకు ఫోన్ ద్వారా సందేశాలు పంపారు. ఇదే విషయాన్ని వలంటీర్లు అధికార పార్టీ నాయకులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా కొందరు వలంటీర్లను బూతులు తిట్టి మరీ డబ్బు తీసుకుని పంపిణీ చేయడం గమనార్హం.
కానూరులో కలకలం
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి బంధువైన ఓ వైసీపీ నాయకుడు శనివారం కానూరులో ప్రభుత్వ సాయం పంపిణీలో పాల్గొన్నారు. ఆయన చేతులమీదుగా లబ్ధిదారులకు రూ.1,000 అందజేశారు. శనివారం సాయంత్రం ప్రభుత్వం ప్రకటించిన పాజిటివ్ లబ్ధిదారుల జాబితాలో సదరు నేత బంధువు కూడా ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది.