వైసీపీలో కుమ్ములాట!

ABN , First Publish Date - 2020-03-15T15:20:19+05:30 IST

వైసీపీ నాయకులు ప్రత్యర్ధులపై..

వైసీపీలో కుమ్ములాట!

ప్రచారంలో మహిళా అభ్యర్థిపై విరుచుకుపడిన యువకులు

వాగ్వాదం, దాడి.. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటి కేసు నమోదు?

కేసు నమోదు చేయకపోతే వెనక్కితగ్గేది లేదంటున్న అభ్యర్థి


గుణదల(కృష్ణా): వైసీపీ నాయకులు ప్రత్యర్ధులపై దాడిచేయడమే కాదు ఆ పార్టీలోనే ఇతర కులాలను కూడా గెలవనిచ్చే పరిస్థితి లేదు. దీనికి నిదర్శనం ఒకటో డివిజన్లో శనివారం ప్రచారంలో చోటు చేసుకున్న ఘటనే. డివిజన్‌ వైసీపీ అభ్యర్థి ఉద్దంటి సునీత గుణదల బిషప్‌గ్రాసీ ఉన్నత పాఠశాల ఎదురుగాగల రైవస్‌ కాల్వకట్ట వెంబడి శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈక్రమంలో సునీత రాయిమీద నుంచి జారి పడబోయింది. దీంతో పక్కనే ఉన్న ఎస్సీ నాయకురాలు చంద్రలీల ఆమెను పట్టుకుంది. అభ్యర్ధి పక్కన మీరు లెగండి యువకులు ఉంటే ఇలా జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుందంటూ చంద్రలీలతో యువకులు వాగ్వాదానికి దిగారు.


మహిళ పక్కన మహిళలు ఉంటేనే రక్షణ ఉంటుందని చెప్పడంతో బూతుపురాణంతో యువకులు సదరు మహిళపై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే గొడవ జరిగింది. అభ్యర్థి కూడా మీరు ఇలా చేయడం ఎంతమాత్రం భావ్యంగా లేదని యువకులను మందలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇరుపక్షాలు బాహాబాహీకి దిగారు. గొడవలో పాత్రధారులుగా ఉన్నవారిపై బైండోవర్‌ కేసు ఉన్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో గొడవకు వెళితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం సహజం. గాయాలపాలైన చంద్రలీల పదిమందిలో నన్ను బూతులు తిడుతూ కొడతారా అంటూ డీసీపీ కార్యాలయానికి వెళ్ళి విన్నవించుకుంది.


సానుకూలంగా స్పందించిన డీసీపీ తక్షణమే పూర్తిస్థాయి విచారణ చేసి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని మాచవరం సీఐ వినయ్‌మోహన్‌ను ఆదేశించారు. రంగంలోకి దిగిన మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు పూర్వాపరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో చంద్రలీలపై దాడి జరిగిన మాట వాస్తవమేనని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆమెను చికిత్సకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన ఇంటిమేషన్‌ ఆధారంగా చంద్రలీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైసీపీ నుంచి వత్తిడి వచ్చినప్పటికీ ఘర్షణకు కారణమైన యువకులపై అట్రాసిటీ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. బాధితురాలు గతంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకురాలు కావడం గమనార్హం.


ఎవరికి అన్యాయం జరిగినా పోరాడేందుకు వెళ్ళే నాపైనే నేడు ఈతరహాలో దాడి జరిగిందంటే దీనిని సమర్ధించే ప్రసక్తేలేదని, అవసరమైతే వైసీపీ నుంచి వైదొలగడానికి కూడా సిద్ధమేనని డంకా పథంగా చెప్పింది. దాడికి పాల్పడిన ఆళ్ళ ప్రసాద్‌రెడ్డి, ఆళ్ళ సాయి, కొండా మహేష్‌ రెడ్డి, కొండా దినేష్‌, ఆటో రాజులపై మాచవరం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితోపాటు పలుసెక్షన్ల కింద కేసు నమోదుకు రంగంసిద్ధం చేసినట్టు సమాచారం. 

Updated Date - 2020-03-15T15:20:19+05:30 IST