విస్తృత ప్రచారంతో భయాలు తొలగించాలి

ABN , First Publish Date - 2020-03-21T10:21:59+05:30 IST

గ్రామీణ స్థాయి నుంచి కరోనాపై విస్తృత ప్రచారంతోపాటు అవగాహన కల్పించి ప్రజల్లో భయాందోళలు తొలగించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

విస్తృత ప్రచారంతో భయాలు తొలగించాలి

రాష్ట్రంలో కరోనా కేసులు మూడే 

కలెక్టర్ల ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షించాలి 

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌


విజయవాడ సిటీ, మార్చి 20: గ్రామీణ స్థాయి నుంచి కరోనాపై విస్తృత ప్రచారంతోపాటు అవగాహన కల్పించి ప్రజల్లో భయాందోళలు తొలగించాలని  సీఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కరోనా నియంత్రణపై సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా శుక్రవారం సీఎం సమీక్షించారు. దేశంలో 191 కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మూడు కేసులు నమోదయ్యాయన్నారు. అవి కూడా ఇటలీ, స్కాట్లాండ్‌, సౌదీఅరేబియా నుంచి వచ్చిన కేసులు మాత్రమేనన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా సురక్షితంగా ఉండవచ్చన్నారు. గ్రామ సచివాలయాల్లో కరోనాపై సమాచారం అందుబాటు లో ఉంచాలన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ఉండాలన్నారు. సంబంధిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయిలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కలెక్టర్‌ ఆధ్వర్యంలో  పక్కాగా పర్యవేక్షణ చేయడంతో పాటు తరచుగా సమావేశాలు నిర్వహించాలన్నారు.


కరోనా సాకుతో నిత్యావసర సరుకులు కొరత సృష్టిస్తే కఠిన చర్యలు చేపట్టాలన్నారు.  ధరలు పెంచితే సహించేది లేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులను కలెక్టర్లు తనిఖీ చేసి ఐసోలేషన్‌ వార్డుల్లో సౌకర్యాలను పరిశీలించాలన్నారు. నిర్దేశిత 21 రకాల మందులు అందుబాటులో ఉన్నదీ, లేనిదీ పరిశీలించాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ ఎక్కువ లేకుండా చూడాలని, బస్సులను శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధి అనుమానాస్పద లక్షణాలు ఉన్న వ్యక్తులు, వారికి వైద్యం అందిస్తున్న వారు మాత్రమే మాస్క్‌లు ధరించాలన్నారు. ప్రజలు అధికంగా గుమిగూడే ప్రదేశాలను మూసివేయడం జరుగుతుందని, ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే చేపట్టడం జరుగుతుందన్నారు. 65 ఏళ్లకు పైబడిన వారు బీపీ, మధుమేహం తదితర వ్యాఽధులు ఉన్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా  ఉంటుందని వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ కె.మాధవీలత, జేసీ-2 మోహన్‌కుమార్‌, డీఆర్వో ప్రసాద్‌, డీఎంహెచ్‌వో టీఎ్‌సఆర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.


 ఇళ్ల పట్టాల పంపిణీలో  జిల్లా యంత్రాంగం పనీతీరు భేష్‌

జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి తీసుకున్న చర్యలపై  జిల్లా యంత్రాంగాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి మరోసారి అభినందించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించారు. పేదలకు ఇంటి స్థలం అందించాలని నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం పనులు వేగవంతం చేయాలన్నారు.  గత సమీక్షతో పోలిస్తే ప్రస్తుతం మంచి ప్రగతి కనిపిస్తుందన్నారు. టిడ్కో గృహాల విషయంలో ఉన్న అంశంపై కృష్ణా,గుంటూరు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25 నాటికి సేకరించిన భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. లే అవుట్‌, ప్లాట్‌ విభజన, మార్కింగ్‌ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి చేయాలన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అంబేడ్కర్‌ జయంతి రోజుకు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ప్లాట్‌లను ముందుగానే అలాట్‌  చేస్తూ లాటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రిజిస్ర్టేషన్‌ రోజున ఒత్తిడి లేకుండా ప్లాట్లు రిజస్ట్రేషన్‌ పనులు నిబంధనల మేరకు ముందుగానే పూర్తి చేసుకోవాలన్నారు. లబ్ధిదారుడిని తనకు ఇస్తున్న ఇంటి స్థలం వద్ద నిలబెట్టి ఫొటో తీసి జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో సుమారు 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ కేసులు వేసి అడ్డుకుంటున్నారని సీఎం అన్నారు. 


నూరు శాతం లేఅవుట్‌లు : కలెక్టర్‌

 కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ నూరు శాతం లేఅవుట్‌ పనులు పూర్తి చేశామన్నారు. ఇప్పటికే రెండు లక్షల మూడు వేల ఇళ్ల పట్టాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ వాసులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్లాన్‌-బీని సిద్ధం చేశామన్నారు. భూసేకరణ చేసిన భూమిలో ఇప్పటివరకు 87శాతం స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగిలినది ఈనెల 26 నాటికి పూర్తి చేస్తామని సీఎంకు వివరించారు. కోర్టు కేసులను కూడా సత్వరపరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. సీఆర్డీఏ  పరిధిలోని భూమికి సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకుని లేఅవుట్‌ తయారీ పనులు ప్రారంభిస్తామన్నారు. 


Updated Date - 2020-03-21T10:21:59+05:30 IST