బియ్యం కార్డు ఇస్తున్నాం.. తీసుకో బాలకా!

ABN , First Publish Date - 2020-12-30T06:16:19+05:30 IST

కుటుంబపెద్ద ఓంకార శ్రీ. ఏడేళ్ల వయస్సు. కుటుంబంలో తను ఒక్కరే.

బియ్యం కార్డు ఇస్తున్నాం.. తీసుకో బాలకా!

అవనిగడ్డ రూరల్‌: కుటుంబపెద్ద ఓంకార శ్రీ. ఏడేళ్ల వయస్సు. కుటుంబంలో తను ఒక్కరే. ఈ వివరాలు పూర్తి చేస్తున్నప్పుడైనా అధికారులకు ‘చిన్నపిల్లవాడికి కార్డా’ అని అనుమానం రావాలి. విచారణ జరగాలి. అలాంటిదేమీ లేదు. ఒక నెంబరు కేటాయించేశారు. ఎంచక్కా బియ్యం కార్డు తీసుకువచ్చి తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. ఏడేళ్లు కూడా లేని తమ కుమారుడి పేరిట మంజూరైన కార్డు చూసి తెల్లబోవడం తల్లిదండ్రుల వంతయింది. అవనిగడ్డ మండలంలో. పాత ఎడ్లంక గ్రామంలో ఈ నిర్వాకం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మైల నాగరాజు-మాధవి దంపతులు తమ కుమారుడు మైల ఓంకార శ్రీ(7) పేరును బియ్యం కార్డులో జత చేయాలని గ్రామవలంటీర్‌ను కోరారు. బాలుడి పేరుమీద ఏకంగా కార్డే మంజూరు చేసేసి ఏప్రిల్‌ నెలలో వచ్చి కొత్త కార్డును, కరోనా ఆర్థిక సాయం రూ.1000ను నాగరాజుకు అందజేశారు. అయితే, అసలు సమస్య ఇప్పుడు వచ్చింది. బాలుడి పేరిట బియ్యం కార్డు ఉండడంతో అమ్మఒడికి అనర్హుడని తేలడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.   


Updated Date - 2020-12-30T06:16:19+05:30 IST