-
-
Home » Andhra Pradesh » Krishna » viral video in social media
-
సీఎం గారూ స్పందించండి.!
ABN , First Publish Date - 2020-12-19T06:15:36+05:30 IST
సీఎం గారూ స్పందించండి.!

చిట్టినగర్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘మాది విజయవాడ కేఎల్‌రావు నగర్. మా నాన్న 2002లో నైనవరంలో స్థలం కొన్నారు. నేను 2004లో పుట్టాను. నాకు పుట్టుకతోనే ఎముకల బలహీనత ఉంది. ఏ వస్తువును బలంగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోతాయి. ఇప్పటి వరకు 30సార్లు విరిగిపోయాయి. నా మందుల ఖర్చుకే చాలా డబ్బులు అవుతున్నాయి. మా నాన్న నెల రోజుల క్రితం స్థలం చూడడానికి వెళ్లారు. ఆ ఊళ్లో ఉన్న పెద్ద మనుషులు స్థలాన్ని కబ్జా చేశారు. కులం, మతం పేరుతో చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. మాకున్న ఒక్క ఆధారాన్ని వాళ్లు సొంతం చేసుకున్నారు. మాకు ఇప్పుడు ఏ ఆధారమూ లేదు. ఈ వీడియోను సీఎం జగన్మోహన్‌రెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. దయచేసి మా స్థలాన్ని మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాను’’ ఇదీ.. సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న ఓ దివ్యాంగురాలి వీడియో.
కొడవలి గణేష్ విజయవాడలో కేఎల్‌రావు నగర్‌లో ఉంటున్నాడు. ఆయకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. గణేష్ టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేష్ పెద్ద కుమార్తె సువర్ణ దుర్గ డిగ్రీ చదువుతోంది. రెండో కుమార్తె మౌనిక సత్యకు పుట్టుకతోనే ఎముకల బలహీనత ఉంది. ఆమె వైద్యానికే సంపాదనలో అత్యధికం ఖర్చు అవుతుంది. వాటిలోనే కొంత పోగేసుకుని గన్నవరం మండలం నైనవరంలో 70 గజాల స్థలాన్ని 2002లో కొనుగోలు చేశాడు. గ్రామంలోని కొందరు పెద్దలు ఆ స్థలంపై కన్నే శారు. రాత్రికిరాత్రి షెడ్డు వేసి అందులో ఓ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన కుటుంబాన్ని అద్దెకు దింపారు. పది రోజుల క్రితం స్థలాన్ని పరిశీలించడానికి వెళ్లిన గణేష్ షాక్ తిన్నాడు. అక్కడ అద్దెకు ఉన్న వారిని ప్రశ్నించగా అసలు అద్దెకు ఇచ్చిన వారి పేరు బయటకు వచ్చింది. వాళ్లను అడిగితే స్థలం తమదేనని ఇంటి పన్ను చూపించారు. జరిగిన ఘటనపై రెండో కుమార్తె మౌనిక సత్య సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గణేష్ కుటుంబం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును, కలెక్టర్ ఇంతియాజ్‌ను శుక్రవారం కలిసి తమకు న్యాయం చేయాలని కోరింది. అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి, సరిహద్దులు తేల్చి న్యాయం చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.