విజయవాడలో టీడీపీ ధర్నా...పాల్గొన్న బోండా ఉమ
ABN , First Publish Date - 2020-12-05T18:45:53+05:30 IST
ఆస్తి, నీటి, డ్రైనేజీ పన్నుల భారాలను ఉపసంహరించుకోవాలంటూ నగరంలోన టీడీపీ ధర్నాకు దిగింది
విజయవాడ: ఆస్తి, నీటి, డ్రైనేజీ పన్నుల భారాలను ఉపసంహరించుకోవాలంటూ నగరంలోన టీడీపీ ధర్నాకు దిగింది. గాంధీనగర్ ధర్నా చౌక్‌లో జరిగిన ఆందోళనలో బోండా ఉమ పాల్గొన్నారు. ఈసందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ... 18 నెలల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెను భారాలు మోపారని మండిపడ్డారు. జగన్ అసమర్ధ విధానాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్, డీజిల్‌పై పన్నుల రూపంలో పెంచారన్నారు. జీవో నెంబర్ 21 ద్వారా వాహనాలపై పన్నులు వేశారని మండిపడ్డారు. తుగ్లక్ నిర్ణయాలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు.
చంద్రబాబు పాలనలో సువర్ణ యుగం అయితే.. జగన్ పాలనలో ప్రజలు బతకలేని దుస్థితి వచ్చిందని విమర్శించారు. కరోనా వచ్చాక సామాన్యులు, మధ్యతరగతి ప్రజల జీవితాలు పూర్తిగా తలకిందులయ్యాయన్నారు. ఇప్పుడు మళ్లీ 196, 197, 198 జీవోల ద్వారా ఆస్తి, డ్రైనేజీ, వాటర్ పన్నులను రెట్టింపు చేశారని తెలిపారు. ఈ పన్నుల భారాలు తగ్గించాలని చంద్రబాబు అసెంబ్లీలో డిమాండ్ చేస్తే.. సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. అపార్టుమెంట్‌లో పదివేలు ఉన్న పన్ను.. ఇప్పుడు ముప్పై వేలు అవుతుందని...అద్దెకున్న వాళ్లు, ఇంటి యజమానులు కూడా ఈ పన్నుల భారాలు మోయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఆర్‌బీఎమ్ యాక్టు నిబంధనల ప్రకారం ఈ జీవోలు తీసుకువచ్చామని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం అప్పులు చేసేందుకు.. సామాన్యులపై భారాలు మోపడం సిగ్గు చేటని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ అప్పుల భారాలు వేయకుండా.. మూడు జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన టీడీపీ పోరాటం చేస్తుందని బోండా ఉమ స్పష్టం చేశారు.